
చెల్లింపులే ఆగాయి!
భూసేకరణ పూర్తి..
గౌరెల్లి – కొత్తగూడెం భూ నిర్వాసితులకు పరిహారం పెండింగ్
సాక్షి, యాదాద్రి: గౌరెల్లి–కొత్తగూడెం జాతీయ రహదారి (930 పీ) నిర్మాణానికి సేకరించిన భూములకు వలిగొండ సెక్షన్‌లో పరిహారం నిలిచిపోయింది. ఈ సెక్షన్‌లో వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో ప్రతిపాదించిన రహదారి నిర్మాణం కోసం 411 ఎకరాల భూములు సేకరించారు. ఇందుకు గాను నష్టపరిహారంగా రైతులకు రూ.122.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, నిధుల లేమితో జాప్యం జరుగుతోంది. నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే తప్ప.. పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
రోడ్డు స్వరూపం ఇదీ..
రంగారెడ్డి జిల్లా గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి 930 పీ నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తొలిదశలో రూ.675.45 కోట్లు విడుదల చేసింది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల మీదుగా గౌరెల్లి –కొత్తగూడెం జాతీయ రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. 42 కిలో మీటర్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పుతో రహదారి నిర్మిస్తున్నారు. ఇందుకోసం చేపట్టిన భూ సేకరణ పూర్తయ్యింది. మోత్కూరు, అడ్డగూడూరు మండలాల పరిధిలో పనులు వేగంగా జరుగుతుండగా వలిగొండ సెక్షన్‌లో ఇంకా మొదలు కాలేదు. ఇక్కడ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న తొర్రూరు రోడ్డునే విస్తరణ
వలిగొండ నుంచి మోత్కూరు, అడ్డగూడూరు మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు ప్రస్తుతం ఉన్న తొర్రూరు రోడ్డును నేషనల్ హైవేగా విస్తరిస్తున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు పరిధిలో రోడ్డు నిర్మాణం పూర్తికాగా.. కొన్నిచోట్ల కల్వర్టులు, వంతెనల నిర్మాణం జరుగుతోంది. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లో పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
వలిగొండ సెక్షన్‌లో సేకరించిన భూములు
గ్రామం ఎకరాలు
భీమనపల్లి 23. 07
దంతూరు 25.05
ధర్మారెడ్డిపల్లి 16.14
జగత్‌పల్లి 10.065
జూలూరు 15.395
కనుముక్కుల 26.015
మొహర్‌నగర్ 8.075
పిలాయిపల్లి 30.02
పోచంపల్లి 53.19
వంకమామిడి 20.26
లోతుకుంట 4.285
మల్లేపల్లి 32.165
పొద్దటూరు 42.335
రెడ్లరేపాక 54.18
సంగెం 42.265
వలిగొండ 4.31
సేకరించిన భూములు ఇలా..
వలిగొండ సెక్షన్‌లో భాగంగా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లో జాతీయ రహదారి నిర్మాణం కోసం 411 ఎకరాలకు అవార్డ్ పాస్ చేశారు. పరిహారం చెల్లింపు పెండింగ్‌లో ఉంది. రెవెన్యూ అధికారులు రైతులతో పలుదఫాలు చర్చలు జరిపి పరిహారం ఖరారు చేశారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటుతో మొత్తం రూ.122.68కోట్లు పరిహారం ఫైనల్ చేశారు.
వలిగొండ సెక్షన్‌లో 411 ఎకరాల సేకరణ, రూ.122.68 కోట్లు బకాయి
నిధుల లేమితో ఆలస్యం
నష్టపరిహారం చెల్లిస్తేనే
సహకరిస్తామంటున్న రైతులు