ప్రమాదవశాత్తు వరికోత మిషన్ దగ్ధం
కేతేపల్లి: వరి పంట కోస్తుండగా ఇంజన్‌లో మంటలు చెలరేగి హార్వెస్టర్(వరికోత మిషన్) దగ్ధమైంది. ఈ ఘటన కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెర్కుపల్లి గ్రామానికి చెందిన చినబోయిన చిరంజీవికి చెందిన చైన్ హార్వెస్టర్‌తో శనివారం రాత్రి స్థానిక రైతు పొలం కోస్తుండగా ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి మంటలు లేచాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడి వరికోత మిషన్‌కు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న నకిరేకల్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. హార్వెస్టర్‌కు అంటుకున్న మంటలను ఆర్పినప్పట్టికీ అప్పటికే యాభైశాతం మేర కాలిపోయింది. యాసంగి వరికోతలు ప్రారంభం కావటంతో హార్వెస్టర్ ఇంజన్‌కు ఇటీవలే మరమ్మతులు చేయించినట్లు తెలిసింది.


