ధరలు పెంచక తప్పలేదు
ద్వారకాతిరుమల ఉదయం నిద్రలేవగానే గొంతులోకి వేడివేడి టీ దిగనిదే చాలామందికి రోజు గడవదు. పని ఒత్తిడిలో కాసేపు ఉపశమనం పొందాలన్నా, స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలన్నా, అలసట తీర్చుకోవాలన్నా టీ తాగాల్సిందే. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరికీ టీతో విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే నాలుగు రోడ్లు కలిసే చోటు నుంచి మారుమూల పల్లె వరకు టీ దుకాణాలు దర్శనమిస్తుంటాయి. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే టీ.. సామాన్యుడి నిత్యజీవితంలో ఓ భాగమైంది. అలాంటి టీ ఇప్పుడు ధరల భారంతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. పంచదార, పాల ధరలు పెరగడంతో టీ, కాఫీ ధరలకూ రెక్కలొచ్చాయి. నిన్నమొన్నటి వరకు పలు ప్రాంతాల్లో రూ. 10కే లభించిన టీ.. ప్రస్తుతం రూ. 15కు చేరగా, రూ. 15 ఉన్న కాఫీ ధర రూ. 20కి పెరిగింది. దీంతో పేదవాడికి సులభంగా అందుబాటులో ఉండే టీ సైతం భారంగా మారుతోంది.
పంచదార, పాల ధరల మంట..
టీ తయారీలో కీలకమైన పంచదార ధరలు ఇటీవల ఒక్కసారిగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో పంచదార ధర రూ. 55 ఉండగా, బెల్లం ధర రూ. 60గా ఉంది. ఆగస్టు 1న కిలో పంచదార రూ. 50 ఉండగా.. అదే నెల 22 నాటికి రూ. 75కు చేరింది. దీంతో టీ, కాఫీ దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత పంచదార ధరలు కొంత తగ్గుముఖం పట్టినా.. పాల ధరలు పెరగడంతో వ్యాపారులపై అదనపు భారం పడింది. టీ, కాఫీ తయారీలో పాలు మరో ప్రధాన ముడిసరుకు. ఇటీవల విజయ డెయిరీ లీటరు పాలపై రూ. 4, ఇతర కంపెనీలు రూ. 2 చొప్పున ధరలు పెంచాయి. పంచదార ధరలు కొద్దిగా తగ్గినా.. పాల ధరల పెరుగుదలతో దుకాణదారులకు ఖర్చులు తగ్గడం లేదు. అటు అద్దెలు, విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలు, గ్యాస్ ఖర్చులు కూడా తోడవడంతో నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు టీ, కాఫీ ధరలను పెంచుతున్నారు.
క్షేత్రస్థాయిలో శుభకార్యాల వేళ..
ద్వారకాతిరుమల క్షేత్రంలో వివాహాది శుభకార్యాలు అధికంగా జరిగే సమయాల్లో టీ, కాఫీలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. పెళ్లిళ్లకు హాజరయ్యే బంధువులు, అతిథులతో పాటు వివిధ పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులు, సిబ్బంది రాత్రి వేళల్లోనూ, తెల్లవారుజామున కూడా టీ, కాఫీలు తాగుతుంటారు. దీంతో ఆయా సమయాల్లో దుకాణాల వద్ద విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే ధరలు పెరగడంతో టీ, కాఫీల కోసం చేసే ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతోంది. గతంలో రూ. 10 ఉన్నప్పుడు రెండు టీలు తాగిన చోట, ఇప్పుడు ఒక్క టీ మాత్రమే తాగుతున్నారు. శుభకార్యాలకు వచ్చేవారు, నిర్వాహకులు సైతం ఈ ధరల పెరుగుదలతో అదనపు ఖర్చును భరించాల్సి వస్తోంది.
చిన్న ఖర్చే.. అయినా పెద్ద భారం!
ఒక్క టీపై పెరిగింది రూ. 5 మాత్రమే కావొచ్చు. కానీ రోజుకు రెండు, మూడు సార్లు టీ తాగే సామాన్యుడికి నెలాఖరుకు ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో రోజుకు రూ. 20తో రెండు టీలు తాగిన వ్యక్తి ఇప్పుడు అదే రెండు టీలకు రూ. 30 వెచ్చించాల్సి వస్తోంది. దీనివల్ల నెలకు రూ. 300 అదనంగా ఖర్చవుతుంది. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి టీ తాగే అలవాటు ఉంటే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. ఆదాయం పెరగకపోయినా నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ అదనపు భారం తప్పడం లేదు. ఒకప్పుడు అలసట తీర్చే చాయ్.. ఇప్పుడు జేబుకు చిల్లు పెడుతోంది.
ఉమ్మడి జిల్లాలో వ్యాపార తీరు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు వంటి ప్రధాన పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలను కలుపుకుని సుమారు 7 వేల నుంచి 8,500 వరకు టీ, కాఫీ దుకాణాలు, చిన్న టీ బండ్లు, బేకరీలు, చాయ్ పాయింట్లు, సాంప్రదాయ హోటళ్లు నడుస్తున్నాయి. ఇందులో ప్రతి చిన్న టీ బండి రోజుకు సగటున రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు వ్యాపారం చేస్తుండగా, పట్టణాల్లోని రద్దీ ప్రాంతాల్లో ఉండే హోటళ్లు, కేఫ్లు రోజుకు రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకు విక్రయాలు జరుపుతున్నాయి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని చిన్న, పెద్ద దుకాణాల ద్వారా రోజువారీగా సుమారు రూ. 1 కోటి నుంచి రూ. 1.30 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా.
పంచదార, పాల ధరల పెరుగుదలతో విక్రయ ధరలకు రెక్కలు
రూ.10 టీ రూ.15కు.. రూ.15 కాఫీ రూ.20కు
పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ అదనపు ఖర్చు
చిరు వ్యాపారులపైనా ధరల ప్రభావం
పట్టణాల్లో ఎప్పటినుంచో టీ రూ.15, కాఫీ రూ.25, ఇతర పానీయాలు రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు, ఇక్కడ శుభకార్యాలు నిర్వహించుకునే వారికి ధరల భారం పడకూడదనే ఉద్దేశంతో నిన్నమొన్నటి వరకు టీ రూ.10, కాఫీ రూ.15కే విక్రయించాం. పంచదార, పాలు, ఇతర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచాల్సి వచ్చింది.
– దేశెట్టి భీమేశ్వరరావు, టీ స్టాల్ నిర్వాహకుడు, ద్వారకాతిరుమల


