ద్వారకాతిరుమల: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం తరఫున మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా వీటిని అందజేశారు. ముందుగా శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు దంపతులు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు పట్టువస్త్రాలతో దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ పూలు, పండ్లు, స్వీట్లు, పట్టువస్త్రాలను దుర్గగుడి ఈఓ సీనా నాయక్‌కు అందజేసి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చినవెంకన్న దేవస్థానం తరఫున వీటిని అందజేసినట్లు వెల్లడించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): స్థానిక పి.పి. రోడ్డు లోని ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ మరియు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఒకసారి ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపుతామని తెలిపారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, ఎలక్షన్ సెక్షన్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ హెచ్ఎన్సీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: రైతులు ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకుని, తమకు నచ్చిన డీలర్ వద్ద కొనుగోలు చేయవచ్చని ఏడీఏ వి.నారాయణ తెలిపారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల ప్రైవేట్, సొసైటీ ఎరువుల వ్యాపారస్తులు, వ్యవసాయ సిబ్బందికి ఎఫ్ఎఫ్ఎస్ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉంటుందని, దుర్వినియోగం అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు ఏడీఏ జి.నరేంద్ర, వ్యవసాయాధికారులు చీర్ల రవికుమార్, ఆర్.ఎస్.ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రకాశం నగర్(రాజమహేంద్రవరం): 70వ ఎస్జీఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ – 2026 బాలికల విభాగంలో విజేతగా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచింది. బాలుర విభాగంలో విశాఖపట్నం విజయకేతనం ఎగురవేసింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఫుట్‌బాల్ బాలికల విభాగంలో తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జట్ల మధ్య జరిగిన ఫైనల్ నిర్ణీత సమయంలో డ్రాగా ముగిసింది. అనంతరం జరిగిన ఫెనాల్టీ షూటౌట్లో తూర్పుగోదావరి 4–3 గోల్స్‌తో చాంపియన్‌గా అవతరించింది. పశ్చిమ గోదావరి రన్నర్‌గా నిలిచింది. అనంతపురం జట్టు 4–0 తో విజయం సాధించి 3వ స్థానం సాధించింది.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా సాయుధ రిజర్వ్ పోలీస్ బలగాల డీఎస్పీగా కే.చంద్రశేఖర్ మంగళవారం పదవీబాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.


