హత్య కేసు ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు ఛేదించిన పోలీసులు

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

● పోలీసుల అదుపులో నిందితులు

● సుపారీ గ్యాంగ్‌ గుట్టురట్టు

భీమడోలు: భీమడోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన తూముల లక్ష్మణ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు, నేరంతో ప్రమేయం ఉన్న ఒక బాలుడిని (జువైనల్‌) అదుపులోకి తీసుకుని భీమడోలు కోర్టులో హాజరుపరిచారు. హత్యకు వినియోగించిన ఇనుప రాడ్డు, మోటార్‌సైకిల్‌, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీఐ వి.కృష్ణ, భీమడోలు ఎస్సై ఎస్‌కే మదీనాబాషా వెల్లడించారు.

హత్యకు దారితీసిన పరిస్థితులు

విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన తూముల లక్ష్మణ (34)కు, వర్రి నరసింహ సోదరి లక్ష్మీతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ భర్త మామిడి శంకర్‌ ఆమెతో గొడవపడి పుట్టింటికి పంపించివేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న తూముల లక్ష్మణను అంతం చేస్తేనే తన భార్యను తిరిగి కాపురానికి తీసుకువస్తానని, హత్యకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని శంకర్‌ తన బావమరిది వర్రి నరసింహతో సుపారీ మాట్లాడుకున్నాడు. డబ్బుకు ఆశపడిన నరసింహ.. మండలంలోని పొలసానిపల్లి బీసీ కాలనీకి చెందిన తాపీ మేస్త్రి బొద్దాని సురేశ్‌కుమార్‌, ద్వారపురెడ్డి గణేష్‌తో పాటు మరో బాలుడితో కలిసి హత్యకు ప్లాన్‌ చేశాడు. ఈ హత్య కోసం మామిడి శంకర్‌ వారికి పలు దఫాలుగా రూ. 1.59 లక్షల నగదు అందించాడు.

పథకం ప్రకారం హత్య

గత నెల 19వ తేదీ రాత్రి లక్ష్మి ద్వారా లక్ష్మణను భీమడోలు రప్పించారు. భీమడోలు జంక్షన్‌కు చేరుకున్న లక్ష్మణను స్థానిక దాలమ్మ – దాలప్ప చెరువు వద్దకు తీసుకువెళ్లి ఫుల్‌గా మద్యం తాగించారు. అనంతరం గణేష్‌ వెనుక నుంచి అతడి గొంతు పట్టుకోగా, నరసింహ చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే చెరువులోని తుప్పల్లో దాచిపెట్టిన ఇనుప రాడ్డుతో బొద్దాని సురేశ్‌కుమార్‌ లక్ష్మణ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆధారాలు మాయం చేసేందుకు యత్నం

హత్య అనంతరం మృతదేహాన్ని మోటార్‌బైక్‌పై తరలించి పొలసానిపల్లి సమీపంలోని పోలవరం కాల్వలో పడేశారు. రక్తపు మరకలున్న దుస్తులను కూడా కాల్వలోనే పడేసి, మృతుని సెల్‌ఫోన్‌ను రాయగడ ఎక్స్‌ప్రెస్‌ రైలు బాత్‌రూమ్‌లో పడేసినట్లు సీఐ తెలిపారు. పోలవరం కాల్వలో కొట్టుకువచ్చిన గుర్తుతెలియని మృతదేహాన్ని పెదవేగి సమీపంలో పోలీసులు గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, హత్య జరిగిన ప్రాంతం భీమడోలు పోలీస్‌స్టేషన్‌ పరిధి కావడంతో కేసును భీమడోలుకు బదిలీ చేశారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేశారు.

నిందితుల అరెస్ట్‌

ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన భీమడోలు జాతీయ రహదారి వంతెన వద్ద వర్రి నరసింహను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం ఏలూరు నుంచి భీమడోలు కోర్టుకు వస్తున్నారన్న పక్కా సమాచారంతో, ఈనెల 12న పోలసానిపల్లి జాతీయ రహదారి వంతెన వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బొద్దాని సురేశ్‌కుమార్‌, ద్వారపురెడ్డి గణేష్‌లను అరెస్ట్‌ చేసి, నేరంతో ప్రమేయం ఉన్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఇనుప రాడ్డు, మోటార్‌బైక్‌, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో తక్షణమే స్పందించి, ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్‌ చేయడంలో సమర్థవంతంగా పనిచేసిన సీఐ వి. కృష్ణ, ఎస్సై ఎస్‌కే మదీనాబాషా, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement