భీమవరం (ప్రకాశం చౌక్), భీమవరం అడ్డవంతెన వద్ద మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు విద్యార్థుల్లో ఒక విద్యార్థినికి తీవ్ర జ్వరం రావడంతో, ఆమె స్నేహితులు రాకేష్, దేవరాజ్ ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డవంతెన వద్ద ఒక వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రాకేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో, భీమవరంలోని వర్మ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల తీరుపై బంధువుల ఆరోపణలు
ఈ ప్రమాద ఘటనపై టూటౌన్ పోలీసుల విచారణ తీరు సరిగా లేదని బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని ఒకసారి, రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొట్టుకున్నాయని మరోసారి చెబుతూ పోలీసులు రోజుకో మాట మారుస్తున్నారని వాపోయారు. ఈ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన కారే ఈ ప్రమాదానికి కారణమని ప్రచారం జరుగుతుండగా, కారు ఢీకొట్టలేదని టూటౌన్ సీఐ రకరకాల వీడియోలు చూపిస్తూ బుకాయిస్తున్నారని వారు ఆరోపించారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదని, పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేసి తమకు సరైన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
గాయపడిన ముగ్గురు విద్యార్థులు ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరు.. భీమవరంలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. తీవ్రంగా గాయపడి వెంటిలేటర్‌పై ఉన్న రాకేష్ తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద గత మూడు రోజులుగా కన్నీరుమున్నీరవుతూ విలపిస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటూ చదువుకుంటున్న తమ కుమారుడు ప్రమాదంలో గాయపడి మృత్యువుతో పోరాడుతుండటాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. మరో కొన్ని నెలల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు ఈ పరిస్థితిలో ఉండటాన్ని చూసి వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.
మూడు రోజుల క్రితం ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
మృత్యువుతో పోరాడుతున్న ఓ విద్యార్థి
కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పోలీసుల తీరుపై బంధువుల ఆరోపణలు
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు


