ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్
భీమవరం: ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి తీవ్రంగా మోసం చేసిన కూటమి నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శెట్టిబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం భీమవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలో జరిగే మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్నారు. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. బహిరంగ మార్కెట్లో బియ్యం, వంటనూనెలు, పప్పులు, ఉల్లిపాయల ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే, కూటమి ప్రభుత్వం పింఛన్లను సైతం తగ్గించి వేధించిందని మండిపడ్డారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మానుకొండ ప్రదీప్, చిగురుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు.


