కూటమి మాటల్ని ప్రజలు నమ్మరు
సాక్షి, భీమవరం : జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో వంచించిన కూటమి నాయకులు తాజాగా రోడ్లు వేస్తాం, డ్రెయిన్లు నిర్మిస్తాం, ఇంటింటికీ రక్షిత నీరిస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామంటూ స్థానిక ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే పనిలో ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీలైనన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టేందుకు నాయకులు పరుగులు పెడుతున్నారు. కొద్దిరోజుల వ్యవధిలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసినట్టు అంచనా. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో గ్రామాల్లో ఎమ్మెల్యేల బిజీ షెడ్యూల్ ఇప్పుడే చూస్తున్నామని స్థానికులు చర్చించుకుంటున్నారు.
నమ్మించి.. సూపర్ సిక్స్‌తో వంచించి..
2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఊదరగొట్టారు. 2024 జూన్ నుంచే అమలు.. ఇవిగో బాండ్లు అంటూ సూపర్‌సిక్స్‌లో ఏ కుటుంబానికి ఎంత వస్తుందో తెలియజేస్తూ ఇంటింటికీ కరపత్రాలు ఇచ్చారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో పాలకొల్లులో తనదైన శైలిలో నీకు 1500, నీకు 1500, నీకు 1500 అంటూ చేసిన ప్రచారం అందరికీ తెలిసిందే. కూటమి సర్కారుకు అప్పుడే 28 నెలలు పూర్తయ్యింది. మిగిలింది మరో 32 నెలలు మాత్రమే. ఇప్పటివరకు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకేపింఛన్, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ హామీలు పత్తాలేవు. ఆడబిడ్డ నిధి అందక జిల్లాలో సుమారు 5,96,313 మంది మహిళలు రూ.2,415 కోట్లు నష్టపోయారు. నిరుద్యోగ భృతి కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి పనులు పేరిట కొబ్బరికాయలు కొట్టడం ఎన్నికల జిమ్మిక్కేనని స్థానికులు అంటున్నారు. ఎన్నికలయ్యాక ఈ పనులను మరుగున పెట్టేస్తారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అతీగతి లేని పింఛన్లు
జిల్లావ్యాప్తంగా కొత్త పింఛన్లకు 49,891 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో డప్పు కళాకారులు 469, దివ్యాంగులు 5,377, మత్స్యకారులు 1,894 మంది, వృద్ధులు 28,619, వితంతువులు 11,177, ఒంటరి మహిళలు 385, చర్మకారులు 523, గీత కార్మికులు 1,003, ట్రాన్స్‌జెండర్లు 16, చేనేత కార్మికులు 427 మంది దరఖాస్తులు చేయగా సుమారు 43,793 మంది అర్హులుగా తేల్చారు. అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు అందిస్తారని లబ్ధిదారులు ఆశించగా.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో పింఛన్ దరఖాస్తులు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని, అన్నీ ఒక్కసారే ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు కొత్త పింఛన్లు ఎన్నికల జిమ్మిక్కేనన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
‘సారు.. ఈరోజు ఏ సెటిల్‌మెంట్‌లో కూర్చోరండి. లోకల్ ఎలక్షన్స్ కదా?.. ఉదయాన్నే శివారు గ్రామం వెళ్లి మూడు రోడ్లకు కొబ్బరికాయలు కొడతారు. పక్క ఊళ్లో మూడు డ్రెయిన్లు, రెండు కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపనలు చేస్తారు. అటునుంచి అటే టౌన్ చేరుకుని బీటీ రోడ్లు, వాటర్ వర్క్స్, పార్కులకు శ్రీకారం చుడతారు. రాత్రిలోపు 12 గ్రామాలు, టౌన్‌లోని 10 వార్డుల్లో తిరగాలి. చాలా బిజీ షెడ్యూల్. ఈ రోజు కుదరదు.. తర్వాత చూద్దాం.’
– కొద్దిరోజులుగా ఎమ్మెల్యేల అనుచరుల నుంచి వినిపిస్తున్న మాటలివి.
స్థానిక ఎన్నికల్లో ఓటర్లకు గేలం వేసే పనిలో కూటమి నేతలు ఉన్నారు. అభివృద్ధి పనులంటూ క్షణం తీరికలేకుండా కొబ్బరికాయలు పట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు.
సారూ.. కొబ్బరికాయ!
హుడావుడిగా సుడిగాలి శంకుస్థాపనలు
ఓటర్లను మభ్యపెట్టే ఎత్తుగడలు
‘కోడ్’ రాక ముందే కొబ్బరికాయలు కొట్టే పనిలో ఎమ్మెల్యేలు
ఇప్పటికే అతీగతీ లేని కొత్త పింఛన్లు
48,891 మంది ఎదురుచూపులు
సూపర్‌సిక్స్ అంటూ అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఎలా వంచించిందో అందరికీ తెలుసు. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగభృతి రాదు, కొత్త పింఛన్ల లేవు. మళ్లీ వారి మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెట్టలేరు. స్థానిక ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం చెబుతారు.
– ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు


