ఊరించి.. విస్మరించి..! | - | Sakshi
Sakshi News home page

ఊరించి.. విస్మరించి..!

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

నరసాపురం : నరసాపురం–మచిలీపట్నం మధ్య 67 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్‌ నిర్మిస్తున్నట్లు 2024 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 రైల్వే బడ్జెట్‌లో ఆమోదం లభించడంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఓ వైపు నరసాపురం–కోటిపల్లి లైన్‌ నిర్మాణంలో ఉండగా, మరోవైపు ఈ కొత్త లైన్‌ పూర్తయితే గోదావరి జిల్లాల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలకు నాలుగు వైపుల నుంచి రైలు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావించారు. అయితే, రెండేళ్లు గడిచినా ఈ ప్రాజెక్ట్‌లో ఎ లాంటి పురోగతి లేదు. ఇంకా డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) సిద్ధం కాలేదని విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు తెలుపుతున్నారు. 2024– 25లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా, ఆ తర్వాత 2025–26, 2026–27 బడ్జెట్‌లలో ప్రాథమిక సర్వేకు కూడా నిధులు కేటాయించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

దశాబ్దాల డిమాండ్‌

1929లోనే బ్రిటీష్‌ హయాంలో నరసాపురం వరకు రైల్వే ట్రాక్‌ విస్తరించారు. తీరప్రాంత నగరాలైన నరసాపురం, మచిలీపట్నాల మధ్య అనుసంధానం కోసం నాడే ప్రతిపాదనలు వచ్చినా నెరవేరలేదు. రూ.2,800 కోట్ల అంచనాతో సాగుతున్న కోటిపల్లి–నరసాపురం లైన్‌కు ఇప్పటివరకు కేంద్రం రూ.1,450 కోట్లు కేటాయించింది. గోదావరిపై రూ.700 కోట్లతో మూడు వంతెనల నిర్మాణం జరుగుతోంది. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే జరిగితే పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కోటిపల్లి, మచిలీపట్నాల మార్గాలు పూర్తయితే విజయవాడ డివిజన్‌లో విజయవాడ తర్వాత నరసాపురం అతిపెద్ద జంక్షన్‌గా, టెర్మినల్‌ స్టేషన్‌గా మారుతుంది. సముద్ర తీరప్రాంతాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌ జాప్యంపై ఉమ్మడి జిల్లా ఎంపీలు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముందుకు సాగని నరసాపురం–మచిలీపట్నం రైల్వే లైన్‌

కొత్త లైన్‌ సర్వేకు 2024లో గ్రీన్‌సిగ్నల్‌

రెండేళ్లు దాటినా కనీసం డీపీఆర్‌ కూడా లేదు

బడ్జెట్‌ల్లోనూ కేటాయింపుల్లేవు

నిరాశలో గోదావరి జిల్లాలవాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement