పొలిటికల్‌ రిజర్వేషన్‌ | - | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ రిజర్వేషన్‌

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పొలిటికల్‌ రిజర్వేషన్‌ ఖరారైంది. బీసీలకు 40 శాతం మున్సిపాలిటీలు కేటాయింపు నీటి మీద రాతగా మిగిలింది. ముఖ్యంగా 6 మున్సిపాలిటీలు ఉన్న పశ్చిమలో బీసీ మహిళకు ఒకే ఒక్క స్థానం దక్కగా ఎస్సీలకు ప్రాధాన్యమే లేకుండా పోయింది. పూర్తిగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో రిజర్వేషన్‌లు ఖరారయ్యాయి. ఇక ఏలూరు జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ బీసీ జనరల్‌, నూతనంగా ఏర్పాటైన చింతలపూడి ఎస్సీ మహిళకు, నూజివీడు ఎస్సీ జనరల్‌ కేటగిరీకి, జంగారెడ్డిగూడెం బీసీ మహిళకు రిజర్వైంది.

ఏలూరులో 62 డివిజన్లు

మున్సిపాలిటీ, నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పశ్చిమలో బీసీలకు, ఎస్సీలకు సరైన ప్రాధాన్యం దక్కని పరిస్థితి ఇక 62 డివిజన్లతో ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సిద్ధమైంది. మేయర్‌ ప్రత్యక్ష ఎన్నిక కావడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో మేయర్‌ స్థానం బీసీ జనరల్‌ రిజర్వ్‌ అయ్యింది. ఏలూరులోని 62 డివిజన్లలో ఒకటి ఎస్టీ, అలాగే 4 ఎస్సీ జనరల్‌, 4 ఎస్సీ మహిళలు, 11 డివిజన్లు బీసీ జనరల్‌, 11 బీసీ మహిళలకు, అలాగే 16 డివిజన్లు జనరల్‌ కేటగిరీలో మహిళలకు, 15 డివిజన్లు జనరల్‌ కేటగిరీలో చేరుస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపాలిటీ నుంచి 2005లో ఏలూరు నగరపాలక సంస్థగా మారింది. ఏలూరు మొదటి మేయర్‌గా ఎస్సీ జనరల్‌ నుంచి కారె బాబూరావు, ఆ తర్వాత తాడిగడప రామారావు పనిచేశారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకూ బీసీ జనరల్‌లో షేక్‌ నూర్జహాన్‌, మళ్లీ 2021 నుంచి 2026 వరకూ జనరల్‌ కేటగిరీలోనూ నూర్జహాన్‌ పనిచేశారు. ఇక చింతలపూడి నగర పంచాయితీ ఎస్సీ మహిళకు, నూజివీడు ఎస్సీ జనరల్‌కు, జంగారెడ్డిగూడెం బీసీ మహిళకు కేటాయించారు.

పశ్చిమలో జనరల్‌కు ప్రాధాన్యం

తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు జనరల్‌ కేటగిరీ కాగా భీమవరం, నరసాపురం, ఆకివీడు జనరల్‌ మహిళకు కేటాయించారు. కేవలం పాలకొల్లు మాత్రమే బీసీ మహిళకు కేటాయించారు. వాస్తవానికి తణుకు, భీమవరం, ఆ కివీడు బీసీ లేదా ఎస్సీలకు కేటాయిస్తారనే ప్రచారం అధికార పార్టీలో బలంగా సాగినా ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో మొత్తం జనరల్‌ స్థానాలు కావడం గమనార్హం. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, భీమవరం కోర్టు కేసులతో గతంలో ఎన్నికలు జరగలేదు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో 2014లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం జనరల్‌ కేటగిరీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ గెలుపొందారు. తణుకు, పాలకొల్లు, భీమవరం 2014లోనూ జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

అధికార పార్టీకి అనుకూలంగా అడ్డగోలు రిజర్వేషన్‌ ప్రక్రియ

పశ్చిమలో మొక్కుబడిగా ఒక స్థానం బీసీలకు కేటాయింపు

ఎస్సీలకు పశ్చిమలో దక్కని ప్రాధాన్యం

మూడు మున్సిపాలిటీలు జనరల్‌ మహిళ, రెండు అన్‌ రిజర్వ్‌డ్‌

ఏలూరు కార్పొరేషన్‌ బీసీ జనరల్‌కు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement