రొయ్యల సాగుపై బెల్లం భారం
8లో
న్యూస్‌రీల్
కొత్త పింఛన్ ఒక్కటీ లేదు
అసంపూర్తిగా ఆక్వా వర్సిటీ
నేడు సీఎం చంద్రబాబు రాక
వాగ్దానాలు మరిచి.. వంచనతో పాలించి..!
● ఎన్నికల్లో జిల్లాకు హామీల వరద పారించిన చంద్రబాబు
● వశిష్ట గోదావరిపై వారధులు, విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ రక్షిత నీరు
● తణుకులో హైటెక్ టవర్, తాడేపల్లిగూడెంలో మార్కెట్ హబ్ ఏవీ?
● ఆక్వా రైతులకు కోల్డ్ స్టోరేజీలు, ఏరియేటర్లపై సబ్సిడీ హామీలు హుళక్కే
● రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వని ప్రభుత్వం
● నేడు జిల్లాకు సీఎం.. తీవ్ర అసంతృప్తిలో ప్రజలు, రైతులు
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం : ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో హైటెక్ టవర్ నిర్మించి, స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని, వలసలను అరికడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. ఉండి ప్రచారంలో ఆక్వా రైతుల కోసం 500 టన్నుల కెపాసిటీతో కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామని, ఏరియేటర్లపై సబ్సిడీ ఇస్తామని నమ్మబలికారు. అంతేకాకుండా విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందిస్తామని, ఆకివీడులో రైల్వే ఓవర్ బ్రిడ్జి కడతామని మాట ఇచ్చారు. ఆచంట సభలో ఏటా వరదలతో అల్లాడే లంక గ్రామాల ప్రజల కోసం అయోధ్యలంక–కోడేరు మధ్య ఏడాదిలోనే గోదావరి వారధి పూర్తి చేస్తామన్నారు. ఈ హామీ అమలుకు నోచుకోక ఏటా వరదల సమయంలో లంక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సి వస్తుంది. ఆచంట, పెనుగొండ, పోడూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి దొంగరావిపాలెంలోని కోడేరు బ్యాంకు కెనాల్‌లోకి ఎత్తిపోతల పథకం నిర్మాణం హామీలు అటకెక్కిపోయాయి. నక్కల డ్రెయిన్ ఆధునికీకరణ హామీకి పాతర వేసి కూటమి నాయకులు డ్రెయిన్ గట్లుకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.
సూపర్ మోసం !
ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక పథకాలకు భారీగా కోతలు పెడుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలను మమ అనిపిస్తూ లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 5.96 లక్షల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి అందక దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా నష్టపోయారు. నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి కోసం వేలాది మంది యువకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
చితికిపోతున్న కర్షకులు
రైతును రాజు చేస్తామన్న చంద్రబాబు పాలనలో జిల్లా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఉచిత పంటల బీమాను రద్దు చేయడంతో పాటు, జిల్లాలోని 80 వేల మంది కౌలు రైతులను పూర్తిగా గాలికొదిలేశారు. మొంథా తుఫాన్ దాటికి 9,201 హెక్టార్లలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ రూపాయి పరిహారం అందలేదు. మరోవైపు సీడ్, ఫీడ్ సిండికేట్ల దోపిడీతో ఆక్వా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైన కూటమి ప్ర భుత్వంపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
రొయ్యల రైతులకు పెరిగిన బెల్లం ధరలు గుడిబండగా మారాయి. చెరువుల్లో పీహెచ్ తగ్గించడానికి బెల్లం వాడుతుంటారు.
పేదవర్గాలకు ఆర్థిక భరోసానిచ్చే సామాజిక పింఛన్ల మంజూరును చంద్రబాబు సర్కారు విస్మరించింది. రెండేళ్ల పాలనలో కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వలేదు. దరఖాస్తుల ఆన్‌లైన్ సైట్‌ను ఆఫ్‌లోనే ఉంచి వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టేసింది. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్న ఎన్నికల హామీ ఊసే ఎత్తడం లేదు. రెండేళ్ల క్రితం కూటమి వచ్చే నాటికి జిల్లాలో 2,32,885 పింఛన్లు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 2,19,625కు తగ్గిపోయింది. పింఛన్ల కోసం అర్హత కలిగిన వేలాది మంది పేదలు సచివాలయాలు, ఎంపీడీఓ కా ర్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా మార్గదర్శకాలు ఏమీ రాలేదని ఉద్యోగులు వారిని వెనక్కి పంపిస్తున్నారు.
‘అధికారంలోకి రావడమే ఆలస్యం.. సంపద సృష్టిస్తాం.. అభివృద్ధి పరుగులు తీయిస్తాం’ అంటూ ఎన్నికల సమయంలో జిల్లా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కురిపించిన హామీల వర్షం ఇప్పటికీ నీటిమూటలుగానే మిగిలింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వశిష్ట గోదావరిపై వారధుల నిర్మాణం, విజ్జేశ్వరం నుంచి ఇంటింటికీ రక్షిత నీటి సరఫరా, హైటెక్ టవర్ల నిర్మాణం తదితర జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క ప్రధాన వాగ్దానం పట్టాలెక్కలేదు. మంగళవారం సీఎం చంద్రబాబు నరసాపురం పర్యటన నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీలు, చేసిన మోసాలపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
ఆక్వా రంగానికి ఊతంగా నరసాపురం రూరల్ లిఖితపూడిలోని 40 ఎకరాల స్థలంలో చేపట్టిన ఆక్వా వర్సిటీ పనులు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవన నిర్మాణాల కోసం గత ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రూ.40 కోట్ల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాలు స్లాబ్ దశకు, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. కూటమి ప్రభు త్వం బిల్లులు విడుదల చేయక పనులు నిలిచిపోయాయి. వర్సిటీకి అనుబంధంగా కళాశాల తరగతులను గత నెల వరకు లక్ష్మణేశ్వరంలోని తుఫాన్ షెల్టర్, రైతు భరోసా కేంద్రాల్లో నిర్వహించగా ప్రస్తుతం నరసాపురంలోని ప్రైవేట్ కళాశాల భవనంలోకి మార్చారు.
నరసాపురం: సీఎం చంద్రబాబు మంగళవారం నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం తన కార్యాలయంలో సీఎం పర్యటన వివరాలు వెల్లడించారు. నరసాపురంలోని గోదావరి గట్టున ఉన్న 2, 3 వార్డుల్లో ఫించన్ల పంపిణీలో పాల్గొని, స్థానిక మత్స్యకారులతో ముచ్చటిస్తారు. అనంతరం మొగల్తూరులో ప్రజాసభ, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.


