ఆధునిక జీవనంలో పోషకాహారమే రక్ష! | - | Sakshi
Sakshi News home page

ఆధునిక జీవనంలో పోషకాహారమే రక్ష!

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

సమతుల ఆహారం అవసరం

ద్వారకాతిరుమల: ఉరుకులు పరుగుల జీవితం.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. సమయం లేక ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌కు అధిక ప్రాధాన్యం.. వెరసి పోషకాహార లోపం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శరీరానికి అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి జాతీయ పోషకాహార వారోత్సవాల నిర్వహణ సందర్భంగా ప్రజల్లో సమతుల్య ఆహారంపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్లేట్‌లో ఇవి ఉండాలి

రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అన్నం లేదా రొట్టెలతోపాటు పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు లేదా పాల పదార్థాలు, గుడ్లు వంటి వాటిని వయసు, శారీరక శ్రమకు అనుగుణంగా తీసుకోవాలి.

ప్రొటీన్లు తప్పనిసరి

శరీర కణజాల నిర్మాణం, కండరాల అభివృద్ధి, రోగనిరోధక శక్తికి ప్రొటీన్లు ఎంతో అవసరం. పప్పులు, శనగలు, పెసలు, మినుములు, గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, మాంసం వంటి వాటిని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఆహారంలో చేర్చుకోవాలి.

పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం

రోజువారీ ఆహారంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను చేర్చుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ అందుతాయి. రంగు రంగుల కూరగాయలు, సీజనల్‌ పండ్లు తీసుకోవడం మంచిది.

నీరు, నిద్ర కూడా కీలకమే

పోషకాహారం తీసుకోవడంతోపాటు తగినంత నీరు తాగడం, సమయానికి నిద్రపోవడం, రోజువారీ శారీరక వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి అవసరం. కేవలం ఖరీదైన ’హెల్త్‌ ఫుడ్స్‌’ తీసుకోవడమే పోషకాహారం కాదని నిపుణులు చెబుతున్నారు.

వీటికి దూరంగా ఉండాలి

అధిక చక్కెర, ఉప్పు, నూనెతో తయారయ్యే ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌, శీతల పానీయాలు, తరచూ ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవడం తగ్గించాలి. ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

పోషకాహారంతో ప్రయోజనాలు

● శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

● రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

● పిల్లల ఎదుగుదల, మెదడు చురుకుదనానికి తోడ్పడుతుంది.

● కండరాలు, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

● అధిక బరువు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల నియంత్రణలో సహాయపడుతుంది.

● ఏకాగ్రత, పనితీరు మెరుగుపడతాయి.

● వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుంది.

మారుతున్న ఆహారపు అలవాట్లతో ఆరోగ్య సమస్యలు

సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

వైద్య నిపుణుల సూచనలు పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం

నేటినుంచి జాతీయ పోషకాహార వారోత్సవాలు

ఫాస్ట్‌ఫుడ్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోగా అధిక కేలరీలు చేరుతున్నాయి. రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, తగిన ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఏదైనా పోషక పదార్థం లేదా సప్లిమెంట్‌ను వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం మంచిది కాదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర ఈ మూడింటినీ జీవనశైలిలో భాగం చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు.

–ఎ.ప్రవీణ్‌ కుమార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి, ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement