సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

Aug 31 2026 1:38 AM | Updated on Aug 31 2026 1:38 AM

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు పెన్షన్‌ రాజ్యాంగ హక్కు జాతీయ క్రీడాకారులకు సత్కారం

నరసాపురం రూరల్‌: సీఎం చంద్రబాబు మంగళవారం నరసాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆదివారం పరిశీలించారు. నరసాపురంలోని పొన్నపల్లి ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్న ప్రాంతాన్ని, పొ న్నపల్లి పడవల రేవు నుంచి వలంధర రేవు వరకు వశిష్ట గోదావరిలో పడవపై ప్రయాణించి పరిశీలించారు. అనంతరం మొగల్తూరులో ము ఖ్యమంత్రి పాల్గొనే ప్రజా సభావేదిక, కేడర్‌ స్ట్రెంత్‌ సమావేశం జరిగే ప్రాంతం, హెలీప్యాడ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ నయీం అస్మి, జేసీ కేఆర్‌ కల్పశ్రీ, అధికారులతో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. ఆర్డీఓలు దాసి రాజు, కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎం.సూర్యారావు, మున్సిపల్‌ కమిషనర్లు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పెనుగొండ: ఉద్యోగులకు పెన్షన్‌ భిక్ష కాదని.. రాజ్యాంగ హక్కు అని ఏపీసీపీఎస్‌ఈఎస్‌ఏ జిల్లా నాయకులు అంజూరి గణేష్‌, సిద్దిరెడ్డి పెద్దిరాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని కోరుతూ పెన్షన్‌ విద్రోహ దినంగా సెప్టెంబరు 1న విజయవాడలో నిర్వహించే భారీ నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం దేవ కాంప్లెక్స్‌ వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు. సీపీఎస్‌ అనే మహమ్మారి ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక, ఆర్థిక భద్రత లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు సీపీఎస్‌ విధానంపై పునః సమీక్ష చేస్తామని కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఎలాంటి సమీక్ష చేయలేదన్నారు. నిరసన ర్యాలీకి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని, జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. వి.సత్యప్రియరామ్‌, గుబ్బల శ్రీనివాస్‌, మెరుపే శ్రీనుబాబు, కౌరు విజయకృష్ణ, గుత్తు ల శ్రీనివాసరావు, బిరుదగంటి కుమార్‌, కంతేటి సత్యనారాయణ పాల్గొన్నారు.

పెనుమంట్ర: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం పెనుమంట్ర మండల మానవతా సంస్థ బాక్సింగ్‌ క్రీడలో ప్రతిభ కనబరిచిన జాతీయ క్రీడాకారులను సత్కరించారు. మానవత మండల అధ్యక్షుడు పడాల రామచంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్‌ తహసీల్దార్‌ తామాడ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మానవత సంస్థ విద్య, వైద్యంతో పాటు క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. మానవత జిల్లా కన్వీనర్‌ కొత్త సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని పెనుమంట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. బాక్సింగ్‌ కోచ్‌లు, క్రీడాకారులు కప్పల చిరంజీవి, కోడి తేజస్విని, వెంకట శైలజ, కండిబోయిన మాధవి, బర్రె నది యా, కప్పల శరణ్యలతో పాటు రిటైర్డ్‌ తహసీల్దార్‌ను ఘనంగా సత్కరించారు. కండవల్లి కిషోర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, అంతర్జాతీయ క్రీడాకారుడు సత్తి సుబ్బారెడ్డి క్రీడాకారులకు కిట్టు బ్యాగులు, రిటైర్డ్‌ టెలికాం ఉద్యోగి పడాల జగన్నాథరెడ్డి నగదు బహుమతులను అందించారు. మానవత రీజనల్‌ చైర్మన్‌ బాణాల శ్రీనివాసరావు, సీనియర్‌ సభ్యులు కర్రీ కృష్ణారెడ్డి, దొంగ జై దుర్గారావు, రోబీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement