భీమవరం: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ పరీక్ష ఆదివారం భీమవరంలో ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని డీఎన్నార్, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని కేంద్రాల్లో 280 మందికి 275 మంది హాజరయ్యారు. డీఎన్నార్ కళాశాలలో 160 మందికి 157 మంది, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 120 మందికి 118 మంది హాజరయ్యా రు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు ఆరు గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. నీట్ పరీక్ష ఆంక్షల నేపథ్యంలో విద్యార్థినుల చెవి రింగులు, చేతి గాజులు, మెడలో పూసల దండలు తొలగించడానికి తల్లిదండ్రులు సహాయం చేశారు. కేంద్రాల వద్ద పోలీసులు, కళాశాలల సిబ్బంది సహకరించారు. ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులు హడావుడిగా పరుగులు తీయడం కనిపించింది. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతిచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.


