న్యూస్‌రీల్
త్వరలోనే బియ్యం సేకరిస్తాం
మిల్లుల వద్దే పేరుకుపోయిన ధాన్యం బస్తాలు
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026
భీమవరం: కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణలో నూక శాతాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మిల్లర్లకు గుదిబండగా మారాయి. గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయించేవారు. అప్పట్లో మిల్లర్లు తేమ శాతం ఎక్కువని, ముక్కపాయ అని సాకులు చెబుతూ రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసేవారు. రైతులు, మిల్లర్లకు మధ్య దళారుల పెత్తనం ఎక్కువగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే వారు. వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, మర ఆడించడానికి మిల్లర్లకు ఇచ్చి వారికి మజూరీ చెల్లించే విధానాన్ని తెచ్చింది. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావడంతో, దళారుల బెడద లేకుండా కష్టానికి తగ్గ ఫలితం దక్కేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుండటంతో రైతులు నిశ్చింతగా ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు. అవసరమైన గోనె సంచుల సరఫరా లేకపోవడం, ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాల వల్ల రైతులు కొంత మేర నష్టపోతున్నారు.
8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
జిల్లాలోని 20 మండలాల పరిధిలో 2.35 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేయగా, వాతావరణం అనుకూలించి పంట ఏపుగా పెరిగింది. దీనివల్ల 9.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొంతమంది రైతులు ఎకరాకు 60 బస్తాల వరకు దిగుబడి సాధించడంతో, ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, రైస్ మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యాన్ని కేటాయించింది. ఇప్పటివరకు 7 వేల మంది రైతుల నుంచి దాదాపు 6.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు సుమారు రూ. 1,470 కోట్లు చెల్లించారు.
కేంద్ర ప్రభుత్వం బియ్యంలో నూక శాతాన్ని మార్పు చేయడంతో సేకరణలో కొంత జాప్యం జరిగింది. గతంలో 15 శాతం నూక ఉన్నా సేకరించేవాళ్ళం. అయితే ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో నూక శాతాన్ని 10 శాతానికి తగ్గించారు. ప్రభుత్వ అనుమతులు రాగానే మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకుంటాం.
– ఎండీ ఇబ్రహీం,
సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్, భీమవరం
మిల్లర్లు ధాన్యాన్ని మరపట్టించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం బియ్యంలో నూక శాతాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నిర్ణయం అమలులోకి రావడంలో జాప్యం జరగడంతో, మిల్లర్ల వద్దే బియ్యం, ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వీటిని నిల్వ చేయడానికి స్థలం లేక మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో అకాల వర్షాలు కురుస్తుండటంతో బయట ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గోనె సంచుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బియ్యాన్ని సేకరించకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని మిల్లర్లు వాపోతున్నారు.
నూక శాతం మార్పుతో ఇబ్బందులు
జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
ఇప్పటికే 6.20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
ధాన్యం, బియ్యం నిల్వకు చోటు లేక మిల్లర్ల అవస్థలు


