నీట్‌ రద్దుపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

నీట్‌ రద్దుపై ఆగ్రహం

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్‌

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాలు

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): కోటి ఆశలతో వైద్య విద్యలోకి ప్రవేశించాలనుకుంటున్న విద్యార్థులకు నీట్‌ రద్దుతో అశనిపాతంలాంటి దెబ్బ తగిలింది. సోమవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా ఈ నెల 5న నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షను రద్దు చేసినట్లు వార్తలు రావడంతో విద్యార్థుల్లో కలకలం రేగింది. తొలుత ఈ వార్తలు అవాస్తవమని భావించినా, పరీక్ష రద్దు విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ధ్రువీకరించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంటర్‌ విద్య పూర్తి చేసుకుని వైద్య విద్యలోకి ప్రవేశించడం కోసం కోటి ఆశలతో ఎంతో పట్టుదలతో చదివి రాసిన నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం విద్యార్థులకు తీరని అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు రావడంతో నీట్‌ పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశంలో రాజ్యమేలుతున్న అవినీతికి ఇది ముచ్చు తునక అంటూ అప్పట్లో విద్యారంగ నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది మరోసారి అలాంటి పరిస్థితులే పునరావృతం కావడం నీట్‌ పరీక్షల నిర్వహణలోని పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది.

ప్రశ్నార్థకంగా 1880 మంది భవిష్యత్తు

ఈ ఏడాది నీట్‌ పరీక్షలకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1880 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 5న ఏలూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షలకు 1819 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల రద్దుతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలు రాసిన వారిలో ఈ ఏడాది ఇంటర్‌ రాసిన వారు అధిక సంఖ్యలో ఉండగా, ఎలాగైనా సరే వైద్య వృత్తిలో ప్రవేశించాలనే లక్ష్యంతో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని రాసిన విద్యార్థులూ కూడా ఉన్నారు. పరీక్ష విజయవంతంగా రాశామని సంతృప్తి చెందుతున్న తరుణంలో నీట్‌ పరీక్ష రద్దు ప్రకటన వారిని ఆందోళనకు గురిచేసింది. మరోసారి పరీక్ష రాయడం కత్తిమీద సాముగా వారు భావిస్తున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు

నీట్‌ పరీక్షను రద్దు చేయడంతో పలు విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్‌ పరీక్షను అధికారుల ఉదాసీనతతో మరోసారి రద్దు చేయాల్సి రావడం దేశ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఘోర వైఫల్యం, వ్యవస్థాగత లోపాల కారణంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హరియాణా, బిహార్‌ రాష్ట్రాల్లో నీట్‌ పరీక్ష పేపర్లు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్ముడుపోయి లీకేజీ అయ్యాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement