భీమవరం: నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్ చెప్పారు. మంగళవారం పుస్తకాల పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాలకుగాను ఇప్పటికే 17 మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మొత్తం టెక్ట్స్‌బుక్స్ సుమారు 4,75 లక్షల పుస్తకాలు అవసరం అవుతాయ న్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని టెక్ట్స్ బుక్స్ మారాయన్నారు. జూన్ 12వ తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నందున సెమిస్టర్ వన్‌కు సంబంధించిన టెస్ట్స్ బుక్స్ అన్ని మండలాలకు ముందుగానే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులన్నింటిలోనూ తెలుగు, ఇంగ్లిషు మీడియంలో ప్రచురించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఎంఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
భీమవరం: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 332 జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె నాగేశ్వరరావు, బి వాసుదేవరావు, ఉద్యోగుల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె రాజా రామ్మోహన్‌రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సహకార సంఘ ఉద్యోగులు చేసిన ఆందోళన మేరకు వ్యవసాయశాఖా మంత్రి, కోఆపరేటివ్ అధికారులు ఆప్కాబ్ చైర్మన్ సమక్షంలో అనేక హామీలు ఇచ్చి జీవో విడుదలలో మాత్రం దీనికి విరుద్ధంగా చేయడాన్ని తప్పు పట్టారు. వెంటనే 332 జీవో రద్దుచేసి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భీమవరం: డీఎన్నార్ కళాశాల యాజమాన్యం, వసుధ ఫౌండేషన్ సహకారంతో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటుకు ఈనెల 14వ తేదీన క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ పవన్‌కుమార్‌రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎన్నార్ కళాశాలలోని వాలీబాల్ క్రీడా ప్రాంగణంలో నెల రోజులపాటు రెసిడెన్సియల్ విధానంలో శిక్షణ ఇస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. వివరాలకు సెల్: 99899 22122, 98669 22122, 63035 78996 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
భీమవరం: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి శివన్నారాయణరెడ్డి చెప్పారు. భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో 41 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన 22,061 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావల్సి ఉందన్నారు. పరీక్షలు ఈనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి జి ప్రభాకరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ నారాయణ, కమిటీ సభ్యులు కేవీ రామారావు, వీకే మల్లేశ్వరరావు, బి నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


