వీరవాసరంలో రొయ్యల మేత బస్తాల దహనం
వీరవాసరం: గత రెండు నెలల కాలంలో రెండో రొయ్యల మేతల ధరలను కంపెనీలు పెంచడంతో ఆక్వా రైతులు భగ్గుమంటున్నారు. వీరవాసరంలో మంగళవారం రైతులు ఆందోళన నిర్వహించి, రొయ్యల మేతల బస్తాలను దహనం చేశారు. కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు పెంచేశారని ఆందోళన చేశారు. ఆక్వా రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉందని, రొయ్యల ధరలు పడిపోవడం.. మరోపక్క రొయ్యల మేతల కంపెనీలు ధరలు తరచూ పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్నా.. తమకు సాగు మాత్రం లాభదాయంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోక తప్పదని కొందరు రైతులు పేర్కొన్నారు. 2023 లో రొయ్యల మేత రేటు టన్నుకు రూ.75 వేలు ఉండగా ప్రస్తుతం రూ.1.10 లక్షలకు పైగా ఉందని, తాజా పెంపుతో ఫీడ్ రేట్ టన్నుకు రూ.1,22,000 పైగా పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రేట్లు తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ కంపెనీల మేత బస్తాలను దగ్ధం చేశారు. ఆందోళనలో రొయ్యల రైతులు సమాఖ్య సంఘం భీమవరం ప్రాంత అధ్యక్షుడు మళ్ళ రాంబాబు (తులసి రాంబాబు), యరక రాజు హరిహర రాజు, యరకరాజు గోపాలకృష్ణరాజు, తోట విజయకుమార్, అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, గుండా నరసింహ రావు, కోటిపల్లి బాబు, దాసరి మాణిక్యాలరావు, వేండ్ర లీల కృష్ణా, తదితరులు పాల్గొన్నారు.


