వైఎస్సార్‌సీపీ గూడెం కన్వీనర్ వడ్డి రఘురాం
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన ఆక్వా రైతుల పాలిట గండంగా మారిందని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం కన్వీనర్ వడ్డి రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీడ్ కంపెనీలు ఇచ్చే ముడుపులకు ఆశపడి, రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి ప్రభుత్వం కంపెనీలకే వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అప్సడా ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు అండగా నిలిచామని, వేలాది విద్యుత్ కనెక్షన్లకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చామని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా సుంకాల భారం తగ్గినా, ఆ మేరకు రాయితీలను రైతులకు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. ఫీడ్ ధరలపై టన్నుకు రూ.25,000 తగ్గించాల్సి ఉండగా, కేవలం రూ.4,000 తగ్గించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా కేజీకి రూ.15 పెంచి ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో 50,800 ఆక్వా కనెక్షన్లకు ఐదేళ్లలో రూ.3,640 కోట్లు సబ్సిడీగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం కృత్రిమంగా డీజిల్ కొరతను సృష్టించి ధరలు పెంచేందుకు ప్రయత్నించిందని, వైఎస్సార్‌సీపీ ఆందోళనకు సిద్ధమవడంతో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఫీడ్ ధరలు పెంచే ముందు ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆమోదం తీసుకోవాలనే గత ప్రభుత్వ నియమాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని రఘురాం విమర్శించారు.


