వీరవాసరం: రొయ్యల ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ సీపీ శెట్టి బలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్‌లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుందని, సగటున ప్రతి ఏడాది 15 లక్షల టన్నుల మేత వినియోగం జరుగుతుందని వివరించారు. ముడి సరుకుల రేటు పెరిగిందనే ఉద్దేశంతో ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లను పెంచడం దారుణం అన్నారు. గతంలో ముడి సరుకుల రేట్లు తగ్గినప్పుడు కనీసం ఆ దిశగా తగ్గించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీల్లో మెజార్టీ కంపెనీలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవేనని గుర్తు చేశారు. ఫీడ్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయన్న కారణంతో ఫీడ్ ధరలు పెంచినప్పుడు, రొయ్యల రైతులకు సైతం నష్టాలు కలిగినప్పుడు రైతులు పండించిన రొయ్యల ధరలకు కూడా రేట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచాలంటే రొయ్యల రైతులతో పాటు రైతు సంఘాల నేతలతో చర్చించి రేట్లు పెంచుకోవాలని నియమం ఉండేదన్నారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఫీడ్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.


