గోవు మృతిపై విచారణ | - | Sakshi
Sakshi News home page

గోవు మృతిపై విచారణ

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మృతి చెందిన గోవు విషయంలో మంగళవారం వెటర్నరీ అధికారులు విచారణ చేశారు. జనవరి 28న పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పుంగనూరు జాతికి చెందిన గోవు మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. నాడు గోవు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందనే విచారణ లేకుండా వెటర్నరీ డాక్టర్‌తో పరీక్ష చేయించకుండా ఆలయ అధికారులు వెంటనే ఖననం చేయించేశారు. క్షీరారామంలో గోవు మృతి, హడావుడిగా అంతిమ సంస్కారాలు చేయడంపై భక్తుల ఆగ్రహం అంటూ నాడు సాక్షిలో కథనం వెలువడింది. ఈ కథనానికి స్పందించిన షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్‌ గోవు ఎలా చనిపోయింది? చనిపోయిన గోవును పరీక్ష చేయకుండా వెటర్నరీ వైద్యులు డెత్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారు అంటూ జిల్లా ఎండోమెంట్స్‌, జిల్లా పశుసంవర్థక శాక అధికారులకు ఆర్‌టీఐ ద్వారా సమాచారం కోరారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నిమిత్తం మంగళవారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌.కె సుధాకర్‌ ఆలయంలో విచారణకు వచ్చారు. దీనిపై ఫిర్యాదుదారుడు ప్రసన్నకుమార్‌, గోవు మృతికి సర్టిఫికెట్‌ ఇచ్చిన రూరల్‌ వెటర్నరీ డాక్టర్‌ జి.వరప్రసాద్‌, ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు తదితరులు విచారణలో పాల్గొన్నారు. దీనిపై తుది నివేదిక జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని విచారణ అధికారి సుధాకర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement