ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలో అక్రమ రేషన్ మాఫియా పైన సొంత పార్టీ నేతలే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సొంగ సందీప్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం రాష్ట్రాల నుంచి దేశాలకు తరలిస్తున్న మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కాకినాడలో సీజ్ ద షిప్ అన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు నాయకులపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.
రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని చింతలపూడి, లింగపాలెం మండలాల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది అక్రమార్కులు పీడీఎస్ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో సేకరించి రీసైక్లింగ్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్వించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార పార్టీ నాయకులే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, పైగా ఆపార్టీ నాయకులే బయటపెడుతున్నారని, దీన్ని బట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికై నా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


