ఉండి: కొందరి స్వార్థం కోసం సుమారు 84 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయడం ఎంత వరకు న్యాయం? అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ అధికారులను ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా ఉణుదుర్రులో ఆలకోడు పక్కన నివాసముంటున్న నిరుపేదల ఇళ్లు కూల్చివేసేందుకు అధికారులు నోటీసులివ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో సోమవారం రాత్రి బాధితులకు అండగా స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద గోపాలన్,ఽ జిల్లా నాయకుడు దనికొండ శ్రీనివాస్, కిలారి తవిటినాయుడు తదితరులు బాధితులతో కలసి నడిరోడ్డుపై నిద్రించారు. అలాగే మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా గోపాలన్ మాట్లాడుతూ ఉణుదుర్రు గ్రామంలో ఇరిగేషన్,డ్రైనేజ్ భూముల్లో నివాసంటున్న 84 నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేసి వాటిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని కొందరి కోసం నిరుపేదల ఇళ్లు కూల్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. పెద్దల ఆక్రమణలో ఉన్న భూములపై అధికారులు చర్యలు తీసుకోకుండా పేదలపై మాత్రమే ఒత్తిడి తేవడం అన్యాయమని మండిపడ్డారు. కార్యక్రమంలో పెళ్ళూరి సుబ్రహ్మణ్యం, పలువురు బాధితులు పాల్గొన్నారు.


