జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతి మహా పర్వదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు 108 ప్రదక్షిణలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 30వేల మంది భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని, సుమారు 10,500 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.7,33,190లు ఆదాయం వచ్చిందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో లక్కవరం ఎస్సై షేక్ జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్‌వీ ప్రసాద్, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సై ఎం.కుటుంబరావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


