ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసుల జారీ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసుల జారీ

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసుల జారీ మహిళ అదృశ్యంపై కేసు రొయ్యల మేత ధర పెంపు దారుణం

ఆగిరిపల్లి: మండలంలో ఇరువురు ఉపాధ్యాయులకు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈదర జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న గుజ్జా అమ్మాజీ, ఆగిరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న వేణుగోపాల్‌రావు ఆమెను వేరే చోటకి బదిలీ చేయిస్తానని చెప్పి 2024లో సుమారు రూ.3 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని సదరు ఉపాధ్యాయుడు తిరిగి ఆమెకు డబ్బులు చెల్లించకపోవడంతో ఈ సంవత్సరం జనవరిలో డీఈఓ వెంకట లక్ష్మమ్మకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై నూజివీడు విద్యాశాఖ అధికారి సుధాకర్‌ విచారణ చేపట్టి ఇద్దరి ఉపాధ్యాయులకి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఇద్దరు ఉపాధ్యాయులు ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

గణపవరం: మండలంలోని అగ్రహార గోపవరం గ్రామానికి చెందిన కుంకట్ల రామాంజనేయులు తన భార్య ఏడుకొండలు (60) కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై ఆకుల మణికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఏడుకొండలు గత 20 ఏళ్లుగా మతిస్థిమితం లేక రాజమండ్రిలో వైద్యం పొందుతుందని, ఈ నెల 2న ఆమె భర్తతో కలిసి పిప్పరలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌): రొయ్యల మేత ధర పెంపు దారుణమని, మేత ధరల పెంపును వెంటనే ఉపసరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.మంగళవారం ఏలూరు అన్నే భవనంలో రొయ్యల మేత ధరల పెంపుపై ఆయన మాట్లాడారు.రొయ్యల మేత ధరల పెంపు వల్ల సాగు ఖర్చులు పెరిగి ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు సుంకాల వలన, రొయ్యలకు వచ్చిన వ్యాధుల వలన ఆక్వా రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని ఆయన గుర్తు చేశారు. రొయ్యల మేత తయారీ సంస్థలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి మేత ధరల పెంపును నిలుపుదల చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement