అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తప్పవు
భీమవరం: జిల్లాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. నూతన భవనాలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహించడం విశేషం. ప్రధాన కూడళ్లు, రోడ్లపైన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి అడ్మిషన్లు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్, 82 ప్రైవేటు కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో తగిన సదుపాయాలు, ఆటస్థలాలు లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలకులు ప్రభుత్వ కళాశాలలను పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల పట్ల ఆసక్తి చూపించారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ప్రైవేటు కళాశాలలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే గాక బస్సు ఫీజులు, హాస్టల్ ఫీజులతో పాటు అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అంటూ మరికొంత గుంజుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీమనబడి నాడు–నేడుశ్రీ పథకంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయినా విద్యార్థుల దృష్టి ప్రైవేటు విద్యాసంస్థలపైనే ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ఇబ్బడిముబ్బడిగా నూతన కళాశాలలు
ఇప్పటికే ఉన్న ప్రైవేటు కళాశాలలతో పాటు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా ప్రస్తుత విద్యా సంవత్సరానికి నూతన కళాశాలలను ప్రారంభిస్తున్నారు. పెద్ద భవనాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ల్యాబ్‌లు, ఏసీతో సహా అధునాతన సదుపాయాలతో తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని, మీ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమంటూ పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులని ఆకర్షిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న కళాశాలలకు ఇప్పటివరకు భవనాల నిర్మాణం పూర్తికాకపోయినా, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా దర్జాగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారంటే వారి వెనుక బడా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి ఎలాంటి జాగా లేకపోయినా ఒక కళాశాల యాజమాన్యం మంచి రోజులంటూ మొండి గోడల మధ్యనే తరగతులు ప్రారంభించడం విశేషం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణంలో ఉన్న భవనాల్లోనే తరగతులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.
ఫీజులు కూడా ఇంటర్‌లో అడ్వాన్స్‌డ్ గ్రూపునకు రూ. 95 వేల నుంచి రూ. 1.10 లక్షల వరకు, జేఈఈ మెయిన్స్‌కు రూ.75 వేల నుంచి రూ.90 వేల వరకు వసూలు చేస్తుండగా, విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సాధించిన మార్కులను బట్టి రూ. 35 వేల వరకు తగ్గింపు ఇస్తూ, మరికొంతమందికి 50 శాతం రాయితీ అంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కళాశాలలో విద్యార్థులను చేర్పించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని మరీ అడ్మిషన్లు ఇస్తున్నారంటే విద్య వ్యాపారం ప్రాధాన్యత అవగతమవుతోంది. ప్రభుత్వ అనుమతులు, భవన నిర్మాణాలు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుమతులు, భవనాలు లేకుండానే తరగతులు
ఫీజు రాయితీలంటూ మభ్యపెట్టే ప్రయత్నం
అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్స్‌కు శిక్షణ అంటూ జోరుగా వ్యాపారం
ప్రభుత్వ అనుమతులు, భవన నిర్మాణాలు పూర్తి చేయకుండా అడ్మిషన్లు నిర్వహించే జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన తరువాతనే అడ్మిషన్లు చేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా జాయినింగ్‌లు చేసుకుంటే చర్యలు తప్పవు.
– జి.ప్రభాకరరావు, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం:


