భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ అప్పారావు, జిల్లా రెవెన్యూ అధికారి శివన్నారాయణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వర్లు తదితర అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. కలెక్టర్ స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం సూచనలు చేశారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 151 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో 42 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలపై సానుకూల స్పందన పెంపొందేలా అధికారులు శక్తివంచన లేకుండా పని చేసి, జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మే 7, 8 తేదీల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలపై సోమవారం కలెక్టర్ శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఎక్కడా మంచినీటి కొరత తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పేదలకు మంజూరు చేసిన గృహాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఆచంటలో ఐటీఐ ఏర్పాటు కోసం అవసరమైన స్థల సేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


