భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కాలు బెనకడంతో, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఓపీ నమోదు చేయించుకుని ఆర్ధోపెడిక్ విభాగంలో వైద్య చికిత్స పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని పలు విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలపై రోగులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, అవసరమైన మందులు అందుతున్నాయా, వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా, ఆసుపత్రి పరిసరాలు, వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా వంటి పలు అంశాలపై రోగులను ప్రశ్నించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం దశలవారీగా చర్యలు చేపట్టిందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యశాఖ పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


