భక్తులతో కిటకిటలాడిన త్రిలింగ క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిటకిటలాడిన త్రిలింగ క్షేత్రం

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

పెనుమంట్ర : త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తరామేశ్వరం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వైశాఖ మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రమే దర్శనమిచ్చే గోస్తనీ నది గర్భాలయంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని, నదీ ఒడ్డున ఉన్న సీతారామ ప్రతిష్ట శ్రీ ఉమా రామేశ్వర స్వామిని, ఆవలి ఒడ్డున ఉన్న శ్రీ లక్ష్మణేశ్వర స్వామిని భక్తులు ఏకకాలంలో దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో చలువ పందిరులు, కరల్రతో కట్టిన బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ అంచనాలకు మించి భక్తులు హాజరు కావడంతో హనుమాన్‌ గుడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు రాజగోపురం ఎదురుగా ఉన్న సుమారు 20 మీటర్ల పొడవున్న క్యూలైన్లో భక్తులు మండు టెండలో ఇబ్బందులు పడుతూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. దాతల సహకారంతో రామలింగేశ్వరుని కలమండపంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు టి. ఎన్‌.సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన అన్నదానంలో సుమారు 6 వేలమందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం వద్ద దాతల సహకారం ఉన్నప్పటికీ దేవదాయ శాఖ అధికారుల పనితీరు వల్ల భక్తులు ఇబ్బందులు పడవలసి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement