ప్రతిదానికి ఎమ్మెల్యే పేరే..
సాక్షి టాస్క్‌ఫోర్స్: ధాన్యాగారంగా పేరుగడించిన ముదినేపల్లి మండలంలో చేపల చెరువుల జాతరకు అడ్డకట్ట పడటం లేదు. రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎకరాలకు ఎకరాలు నిర్వాహకులు తవ్వేస్తున్నారు. అనమతులు మూరెడు.. తవ్వేది బారెడు అన్న చందంగా మారింది ముదినేపల్లి మండలంలో పరిస్థితి. పూర్వం కొల్లేరులో బడాబాబులు లీజులు పేరుతో విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం నుంచి వచ్చి సాగు చేసేవారు. అదే పద్ధతి నేడు ఇక్కడ గ్రామాల్లో కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల బడాబాబులు వచ్చి పచ్చని పొలాలను చేపల చెరువుల లీజుల పద్ధతుల్లో తవ్వుతున్నారు.
ఉలిక్కిపడుతున్న ఊటుకూరు
ప్రకృతితో కూడిన ప్రశాంతతకు నిలయంగా పేరు పొందిన ఊటుకూరులో ఇప్పుడు పొక్లెయిన్ల మోత వినిపిస్తోంది. ఇక్కడ ఓ వ్యక్తి చెరువు తవ్వకం చేస్తున్నారు. అనుమతులు 8 ఎకరాలకు ఉన్నాయని రెవెన్యూ సిబ్బందిలో ఒకరు చెబుతుంటే లేదు 20 ఎకరాల వరకు ఉందని మరొకరు చెబుతున్నారు. ప్రస్తుతం తవ్వుతున్న భూముల సమీపంలో మందబయిలు భూములు ఉన్నాయి. గ్రామ అవసరాలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ భూముల విషయంపై ఇటీవల గ్రామంలో ఆందోళనలు సైతం జరిగాయి. రెవెన్యూ సర్వేయర్ హద్దులు కూడా నిర్ణయించకుండా తవ్వుతున్నారనే విమర్శలు వివిపిస్తున్నాయి. పైగా ఇక్కడ తవ్విన మట్టిని గట్లుకు ఉపయోగిస్తూ, కొన్ని ట్రాక్టర్లు గ్రామంలో భూములు పూడ్చడానికి వెళుతున్నాయని ఆరోపిస్తున్నారు.
సర్వే చేయిస్తాం..
ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి ఎంవీవీ సత్యంబాబును వివరణ కోరగా తవ్వకాలకు అనుమతులు ఉన్నాయన్నారు. మందబయిలు భూములు తవ్వితే అడ్డుకుంటామన్నారు. సర్వేయర్‌తో కలసి భూములను పరిశీలిస్తామన్నారు.
నియోజకవర్గంలో చెరువుల తవ్వకాల విషయంలో మీడియా వెళుతోంటే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు దృష్టికి తీసుకెళ్లామని నిర్వాహకులు ఘాటుగా సమాధానం చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ముదినేపల్లి మండలాన్ని మొత్తాన్ని శాశించే ఓ నాయకుడు కనుసన్నల్లోనే ఏపనైనా జరగాలనే హుకుం ఇక్కడ కొనసాగుతోంది. అధికారులు సైతం ఆయన ఇంటికి వెళ్లి శాఖాపర విషయాలు చర్చిస్తున్నారు. కూటమి నాయకుల్లో సైతం అతని మాటకు ఎదురు చెప్పలేక మిన్నుకుంటున్నారు. జిల్లా స్థాయి అధికారులు ముదినేపల్లి మండలంలో ఆక్వా చెరువులకు ఎన్ని ఎకరాలకు అనుమతులు ఇచ్చారనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని పలువురు కోరుతున్నారు.
ఊటుకూరు చెరువు తవ్వకంపై వివాదం
మందబయలు భూములు తేల్చకుండా తవ్వకం
అనుమతులు ఉన్నాయంటున్నరెవెన్యూ సిబ్బంది
ఎన్ని ఎకరాలనేది స్పష్టత కరవు


