ఆగిరిపల్లి: ఇరు రాష్ట్రాల్లో మానసిక ఆరోగ్య రంగంలో అందించిన సేవలకుగాను మండలంలోని కనసానపల్లికి చెందిన యువ సైకాలజిస్ట్ పేట సాయిప్రియకు హైదరాబాదులో సైకాలజిస్ట్ అసోసియేషన్ తరుఫున 2026 సంవత్సరానికి గాను ‘ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైకాలజీ’ అవార్డును ప్రదానం చేశారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సాయిప్రియకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే మానసిక ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న సాయిప్రియను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, జాతీయ కమిషన్ మాజీ మహిళా సలహాదారురులు టి.వెంకటరత్నం, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి రామచందర్ పాల్గొన్నారు.
వీరవాసరం: రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగడం వీరవాసరంలో కలకలం రేపింది. వీరవాసరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే శాఖకు సంబంధించిన ఖాళీ స్థలం ఉంది. అక్కడ తాటి మట్టల మధ్య సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు కంగారు పడ్డారు. స్థానికులు స్పందించి మంటలను అదుపు చేశారు. ఇది ఆకతాయిల పనిగా స్థానికులు పేర్కొంటున్నారు.
ఏలూరు (టూటౌన్) : ఏలూరులో ఒకటవ అడిషనల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్)గా పనిచేస్తున్న వి.రఘునాఽథ్‌ని గుంటూరులో 3వ అడిషనల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కమ్ జేఎంఎఫ్‌సిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతిలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కమ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్‌గా పనిచేస్త్నున్న బి.వాణిశ్రీని నియమించారు.
ముదినేపల్లి(కై కలూరు): సింగరాయపాలెం అమృతేశ్వరస్వామి ఆలయ హుండీ చోరీకి గురైంది. దీనితో పాటు ఆలయ ఆవరణలోని ద్విచక్ర వాహనాన్ని సైతం దొంగలు అపహరించారు. అర్చకుడు రుద్రపాక శివసత్య వరప్రసాద్ సోమవారం ఉదయం ఈ విషయాన్ని గమనించి దేవస్థాన ఈవో ఆకుల కొండలరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ముదినేపల్లి పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. హుండీల్లో సుమారు రూ.10వేలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముదినేపల్లి ఎస్సై వీరభ్రదరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదానికి
గురైన యువకుడి దుర్మరణం
ద్వారకాతిరుమల: సెల్‌ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బైక్ నడుపుతున్న ఓ యువకుడు ఆ బైక్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడి, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని వీఎస్ దర్బార్ దాబా వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. భీమవరంనకు చెందిన కుచర్లపాటి వర్మ(36) గత కొన్నేళ్లుగా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి సత్తెన్నగూడెం రోడ్డులోని ఎస్‌ఎంఆర్ వెంచర్‌లో నివాసం ఉంటున్నాడు. సత్తెన్నగూడెంలో నాటుకోళ్ల ఫాంను నిర్వహిస్తున్నాడు. అలాగే గొల్లగూడెం సమీపంలోని ఓ కోడి పిల్లల హేచరీలో పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే హేచరీలో పనులు ముగించుకున్న వర్మ మండలంలోని తిమ్మాపురంలో నివాసం ఉంటున్న తన అన్నయ్య కుచర్లపాటి వెంకట నాగరాజు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్‌పై రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంటికి బయల్దేరాడు. సెల్‌ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బైక్‌ను వేగంగా నడిపాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో, తీవ్ర గాయాలపాలైన వర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్నయ్య వెంకట నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ జి.దుర్గారావు తెలిపారు.


