మండే ఎండల్లో అంగన్‌వాడీ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

ఇంటికెళ్లి ఇవ్వాలి

చిన్నారులు అల్లాడిపోతున్నారు

చిన్నారులు ఆపసోపాలు

పౌష్టికాహారం ఇంటి వద్ద ఇవ్వాలని డిమాండ్‌

దెందులూరు: జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం చిన్నారుల వయసు ఎండలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారు. మండే ఎండల్లో కేంద్రాలు నిర్వహించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్న చిన్నారులు, సిబ్బంది నానా ఇక్కట్లు పడుతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్‌ సిబ్బంది పౌష్టికాహారాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఇస్తారు. ఈ మాదిరిగానే ఎండలు మండుతున్న దృష్ట్యా అంగన్‌వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని చిన్నారులకు ఇంటికి వెళ్లి అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎండల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించడంపై జిల్లా వ్యాప్తంగా చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం 8 గంటలకే ఎండ ప్రచండం మొదలవుతుంది. వీలైనంత త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్ళాలని వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు, ప్రజలు ఉరుకులు పరుగులు మీద తమ పనులను చేసుకుంటున్నారు. జూన్‌ రెండో వారం వరకు ఇదే పరిస్దితి కొనసాగుతుందని ఇప్పటికే హెచ్చరిస్తుంటే, అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారుల పరిస్ధితిపై అధికారులకు గానీ, ప్రజా ప్రతినిధులకు గానీ కనికరం లేకుండా పోయింది. వేసవిలో కేంద్రాలకు వెళ్ళే చిన్నారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో మగ్గిపోతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేయకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం సమయాల్లో మార్పు

వేసవి వచ్చినప్పటికీ యథావిధిగా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సెలవులు మంజూరు చేసింది. వేసవికాలంలో ఎండ దెబ్బ తగలకుండా విద్యార్థులను సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో సెలవులు ఇస్తారు. దీనికి విరుద్ధంగా మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించే అంగనన్‌వాడీ కేంద్రాలకు మాత్రం వేసవి వేడి తగలనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాల నుంచి 5 ఏళ్ల వయస్సు కలిగిన విద్యార్ధులకు విద్యా బుద్ధులు నేర్పుతుంటారు. మండుతున్న ఎండల దష్ట్యా అంగన్‌వాడీలకు ఇటు యూనియన్‌లు, చిన్నారుల తల్లిదండ్రులు అధికారులపై ఒత్తిడి తేస్తే, సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు తప్ప పూర్తిగా సెలవలు ఇవ్వలేదు. ప్రభుత్వమే ఉదయం 10 గంటల తరువాత బయటకు రావద్దని హెచ్చరిస్తుంటే, చిన్నారులు మాత్రం ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పసివాళ్ల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. అదికారులు ఇప్పటికై న స్పందించి అంగనన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించి మండుతున్న ఈ భారీ ఎండల నుంచి చిన్నారులను కాపాడాలని తల్తిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు – 2226

అంగన్‌వాడీ వర్కర్లు – 2101

హెల్పర్లు – 1827

మినీ వర్కర్లు – 66

3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు – 24,483

7 నెలల చిన్నారులు – 42,529

అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని ఇంటికి వెళ్లి సిబ్బంది ఇస్తున్నారు. అలాగే చిన్నారులకు ఎండలు తగ్గేవరకు ఇంటికి వెళ్లి పోష్ఠికాహారాన్ని అందించాలి. మండుతున్న ఎండలు దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

మండల సరస్వతి, జెడ్పీటీసీ, ఏలూరు

ఉదయం అంగన్‌వాడీకి వెళ్లినప్పుడు బాగానే ఉంటారు. ఎండలో ఇంటికి వచ్చేటప్పటికీ అలసరిపోతున్నారు. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు. ప్రభుత్వం స్పందించి ఎండల్లో అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలి.

నిట్టా లీలానవకాంతం, జడ్పీటీసీ, దెందులూరు

Advertisement
 
Advertisement
Advertisement