● 9 ఏళ్లలో రూ.99 కోట్లతో అభివృద్ధి పనులు
● మండపాలు, క్యూ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న తపన, తాపత్రయం క్షేత్రాన్ని అభివృద్ధిలో పరవళ్లు తొక్కిస్తోంది. గత 9 ఏళ్లలో శ్రీవారి కొండపై సుమారు రూ. 99 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. వాటి ద్వారా ప్రస్తుతం భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్ క్షేత్రాభివృద్ధికి శ్రమిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా..
క్షేత్రంలో అభివృద్ధి పనులను మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీవారి కొండపై సుమారు రూ.70 కోట్లతో నిర్మించిన శ్రీ వకుళమాత అన్నప్రసాద భవనం, అనివేట్టి మండపం, స్వామివారి నిత్యకల్యాణ మండపం, కేశఖండనశాల, పలహారశాల, ప్రసాదాలు, టికెట్ కౌంటర్లు, రెండు ఘాట్‌రోడ్లు, మాధవ కల్యాణ మండపంలో నిర్మించిన వంటశాల, భోజన శాలలు, మాధవుని కుంట, పవర్‌హౌస్, సెంట్రల్ స్టోర్, శివాలయం–దొరసానిపాడు, పలు ఘాట్ రోడ్లను 2018లో ప్రారంభించారు. తాజాగా రూ. 29 కోట్లతో నిర్మించిన శాశ్వత క్యూకాంప్లెక్స్, విస్తరించిన అనివెట్టి మండపం, 5 అంతస్తుల శివాలయం రాజగోపురాన్ని ఈనెల 9న ప్రారంభించారు.
అందుబాటులోకి మరో 40 మండపాలు
సామాన్య భక్తులు వివాహాలు చేసుకోవడానికి అనివెట్టి మండపాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. పాత అనివెట్టి మండపంలోని 40 మండపాల్లో ప్రస్తుతం 32 మండపాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కొత్త మండపం ప్రారంభం కావడంతో మరో 40 మండపాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే అనివెట్టి మండపాల సంఖ్య 72కి చేరింది. కేవలం రూ. 2 వేలు నామమాత్రపు రుసుముకు వీటిని అద్దెకు ఇస్తున్నారు.
ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఇక్కడ చెరగని ముద్ర వేశారు. చినవెంకన్న ఆలయానికి ఐదోసారి ఈఓగా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. ఛైర్మన్ మద్ధతు సంపూర్ణంగా ఉండటంతో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సఫలీకృతం అవుతోంది.


