ఉంగుటూరు: ఎ.గోకవరం గ్రామ ఆయకట్టు పరిధిలో కంకర తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు నిలిచిన తవ్వకాలు, ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక అవసరాలకు కంకర లభించకుండా, నిబంధనలకు విరుద్ధంగా విచక్షణారహితంగా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణం దెబ్బతినేలా అత్యంత లోతైన గోతులు తవ్వడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పొరపాటున పశువులైనా, రైతులైనా లేదా కూలీలైనా ఆ క్వారీ గోతులలో పడితే ప్రాణాపాయం తప్పదని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకుల అండదండలతోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


