జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఎల్లా వేణుగోపాల్, ఎల్లా మంగ భార్యాభర్తలు. వీరికి ఆరుగురు సంతానం కాగా, వారిలో ముగ్గురు చనిపోయారు. భర్త వేణుగోపాల్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో, మిగిలిన ముగ్గురు పిల్లలను మంగ కష్టపడి పోషిస్తోంది. గంజాయి, మద్యానికి బానిసైన వేణుగోపాల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం ఉదయం వేణుగోపాల్ భార్యతో గొడవకు దిగాడు. పిల్లలు అమ్మమ్మ నాగుల రామలక్ష్మికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న రామలక్ష్మి గొడవను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆగ్రహానికి గురైన వేణుగోపాల్ చాకుతో ఆమైపె దాడి చేశాడు. ఈ దాడిలో రామలక్ష్మి మెడ, గొంతు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మంగ స్థానికుల సాయంతో 108 వాహనంలో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం రామలక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


