ఉండి: ఎవరికీ అభ్యంతరం లేని ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ విమర్శించారు. మండలంలోని ఉణుదుర్రులో ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణల తొలగింపుపై అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆదివారం బాధితులు రోడ్డెక్కారు. నినాదాలు చేస్తూ గ్రామంలోని సచివాలయాన్ని చుట్టుముట్టారు. కూటమి ప్రభు త్వం హామీ మేరకు ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల నివాస యోగ్యమైన భూమి ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకారం అందించిన తర్వాతే తమ ఇళ్లు తొలగించాలంటూ బాధిత మహిళలు, సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. తమ ఇళ్లను తొలగించి బడాబాబులకు ఆ భూమిని అప్పగించాలని చూ స్తున్నారని విమర్శించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనను పట్టించుకోకుండా ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూల్చడం ఘోరమన్నారు. నివాసయోగ్యం కాని ప్రాంతంలో సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చేశాం.. అక్కడికి వెళ్లిపోండని అంటే పేదలు ఎలా బతుకుతారని గోపాలన్ ప్రశ్నించారు. ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా, గ్రామ ఇన్‌చార్జి కార్యదర్శి రామ్మోహన్‌రావు బాధితులతో చర్చించారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. నాయకుడు ధనికొండ శ్రీనివాస్, బాధిత కుటుంబాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


