తణుకు అర్బన్: తణుకు నియోజకవర్గంలో వరుస మోసాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో తణుకులో వెలుగులోకి వస్తున్న మోసాలతో ఎవరితో ఏం మాట్లాడితే ఏ మోసం చేస్తారోననే భయం వెంటాడుతోంది. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఆరవల్లిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లు దోచేసిన కూటమి నేతల వ్యవహారం మరువక ముందే, తణుకు పట్టణంలో బంగారం బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామని, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ అమాయక మహిళల నుంచి ఒక కిలాడీ జంట రూ. 25కోట్లకు టోకరా వేసింది. అంతకుముందు తణుకు పట్టణంలో ఒక బంగారం వ్యాపారి బంగారు ఆభరణాలు చేస్తానని నమ్మించి సుమారుగా 19 మంది బాధితుల నుంచి రూ.10 కోట్లకు పైగా దోచుకుని ఉడాయించాడు. ఇలా వరుస మోసాలు, దోపిడీలతో తణుకు ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే తణుకు ప్రాంతంలో గత ఏడాదిన్నరలో వెలుగుచూస్తున్న మోసాలు, దోపిడీలు చెడ్డ పేరు తీసుకువస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆరవల్లి పరువు తీసిన కూటమి
అత్తిలి మండలం ఆరవల్లిలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అమాయకులైన నిరుద్యోగులకు ఉద్యోగాల ఎరవేసి సుమారుగా 50 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దోచేసిన వ్యవహారం బట్టబయలు కావడం, నిరుద్యోగులను నమ్మించేందుకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జిల్లా కలెక్టర్‌తో పాటు ఐఏఎస్ అధికారుల సంతకాలతో ఉన్న సిఫార్సు లెటర్లు సృష్టించడం సంచలనంగా మారింది. ఇందులో కూటమి నేతలు ఉన్నారంటూ వివిధ పత్రికలు, ప్రసార సాధనాల్లో రావడంతో ముందుగా జనసేన నాయకులు, ఆ తరువాత టీడీపీ నాయకులు సైతం ఎవరికి వారు విడివిడిగా తణుకు, అత్తిలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలోనే మోసం చేసిన వారున్నారనే ఆరోపణలు ఆరవల్లిలో తలెత్తడం విశేషం. ఇచ్చిన డబ్బులు రావనే ఉద్దేశంతో పాటు దోపిడీ దొంగల బెదిరింపులతో బాధిత నిరుద్యోగులు ఇప్పటివరకు బయటపడలేదు. ఉద్యోగాల ఆశతో అప్పులు చేసి డబ్బులు ఇచ్చామంటూ బాధితులు గ్రామంలోని పెద్దల వద్దకు పంచాయతీకి వస్తున్నారే కానీ, కూటమి నేతల భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని దుస్థితి. అంతకుముందు ఆరవల్లి గ్రామం వైఎస్సార్ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని కాలనీ వాసుల నుంచి ఇంటికి రూ.1500 చొప్పున వసూలు చేయడాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, వెంటనే టీడీపీ నాయకులు తిరిగి ఎవరి డబ్బులు వారికి ఇచ్చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖకు ముట్టచెప్పాలని టీడీపీ నాయకులు వసూలు చేసినట్లుగా కాలనీ వాసులు చెబుతున్నారు.
పోలీసుల ప్రేక్షక పాత్ర
కిలాడీలు వరుసగా అమాయకులను మోసం చేసినా, ఆరవల్లిలో ఉద్యోగాల మోసంలో ఏకంగా పవన్ కల్యాణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన సిఫార్సు లెటర్లు బయటపడినప్పటికీ తణుకు పట్టణ, అత్తిలి స్టేషన్ల పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సిఫార్సు లెటర్ల వ్యవహారంలో కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం చూస్తుంటే ఏ రాజకీయ ఒత్తిడిలో ఉన్నారోనని తణుకు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మోసానికి పాల్పడిన కూటమి నాయకులు ఎవరనేది అందరికి తెలిసినప్పటికీ వారిని ఇప్పటికీ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ వెంటే ఉంచుకుని పెద్దపీట వేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.
తణుకు నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో రూ.40 కోట్ల దోపిడీ
ఆరవల్లిలో ఘటన మరువక ముందే మరొకటి వెలుగులోకి
పవన్ కల్యాణ్ సంతకం ఫోర్జరీ చేసినా పట్టించుకోని వైనం


