నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్‌

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ పెద్దింట్లమ్మా.. కరుణ చూపమ్మా పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు యువకుడి అదృశ్యం రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నేత మృతి

జంగారెడ్డిగూడెం: పర్సును పోగొట్టుకున్న వృద్ధురాలికి దానిని అందజేసి ఓ ఆటో డ్రైవర్‌ తన నిజాయతీని చాటుకున్నాడు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్‌ చిట్టిబోయిన ఆంజనేయులు (అంజి) స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో వెళ్తుండగా అతనికి ఒక పర్సు దొరికింది. ఆ పర్సు తెరిచి చూడగా అందులో రూ. 2,000 నగదు, మందుల చీటీ, ఆధార్‌ కార్డు ఉన్నాయి. ఆధార్‌ కార్డు ఆధారంగా ఆ పర్సు చాగంటి చంద్రమ్మ అనే వృద్ధురాలిదని గుర్తించాడు. వెంటనే విచారణ చేసి ఆమెకు సమాచారం అందించాడు. అనంతరం జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ సమక్షంలో ఆ పర్సును వృద్ధురాలికి అందజేశాడు. ఈ సందర్భంగా వృద్ధురాలు అంజికి కృతజ్ఞతలు తెలపగా, అతని నిజాయతీని ఎస్సై, పలువురు అభినందించారు.

కై కలూరు: అమ్మా పెద్దింట్లమ్మా.. నీ కరుణా కటాక్షాలు మాపై చూపవమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. సెలవు రోజు కావడంతో సమీప జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఆదివారం ఒక్కరోజే ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, తీర్థాలు, ప్రసాద విక్రయాలు, విరాళాలు మరియు వాహన పూజల ద్వారా మొత్తం రూ. 67,350 ఆదాయం వచ్చిందని తెలిపారు.

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, కుంభస్థాపన, నిత్యహోమం తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదారులుగా అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరిచర్ల జగపతిరాజు – ఝాన్సీరాణి దంపతులు, గొట్టుముక్కల భాస్కరరాజు దంపతులు వ్యవహరించారు. కోనంగపల్లి సత్యపవన్‌ ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రుషికేష్‌ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. సంతానం లేని భక్తులకు గరుడ ప్రసాదం అందజేశారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ మేజిస్ట్రేట్‌ ఐ.శ్రీనివాస్‌శర్మ కుటుంబ సభ్యులు, జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి కేఎస్‌ఆర్‌ తేజస్వి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు.

భీమడోలు: పొలసానిపల్లికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన బత్తిన దుర్గా శివ ప్రసాద్‌ ఐటీఐ చదువుకుని ముగ్గు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ శనివారం సాయంత్రం ఏలూరు వెళ్లి వస్తానని ఇంటిలో చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో తండ్రి బత్తిన మాణిక్యాలరావు ఆదివారం భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దెందులూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు, పెరుగ్గూడెం సర్పంచ్‌ యలమర్తి రేవతి భర్త యలమర్తి రామకృష్ణ (50) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రామకృష్ణ ద్విచక్ర వాహనంపై పొరుగు గ్రామం నుంచి ఇంటికి వస్తుండగా పంగిడిగూడెం వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్‌లో ఏలూరులో ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement