న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో 14 పూర్తి
నిర్మాణాలు త్వరలో పూర్తి చేయిస్తాం
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతులను ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని భద్రపర్చుకునే అవకాశం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతుల కోసం నిర్మాణాలు చేపట్టిన మల్టీపర్పస్ గోడౌన్లు ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో రైతులు ధాన్యం, ఇతర పంటలు నిల్వ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.
20 మండలాలు.. 2.30 లక్షల ఎకరాలు
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. అలాగే పలువురు రైతులు కూరగాయలు, అరటి, కొబ్బరి వంటి పంటలతో పాటు ఆక్వా సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులు పంటలను నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినపుడు విక్రయించుకునేలా సహకార సంఘాల ఆధ్వర్యంలో మల్టీపర్పస్ గోడౌన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 21 గోడౌన్ల నిర్మాణానికి స్థల సేకరణ, ఒక్కో నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తికాలేదు.
పంట కోసం పాట్లు : ప్రస్తుతం జిల్లాలో దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ధాన్యం పట్టుబడికి గోనె సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వాతా వరణంలో మార్పులు కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురవడం, మబ్బులతో రైతులు కలవరపడుతున్నారు. ఇటువంటి తరుణంలో గోడౌన్లు అందుబాటులో ఉంటే ధాన్యం నిల్వ చేసుకుని సంచులు లభించినప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. పంట కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ధాన్యం నిల్వ చేసుకునే జాగా లేకపోవడంతో వర్షానికి తడిచిపోతుందనే భయంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో గత ప్రభుత్వంలో 21 గోడౌన్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా అప్పట్లోనే 14 నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,000 టన్నుల సామర్థ్యం గల గోడౌన్, ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్లాట్‌ఫామ్స్ నిర్మాణాలకు రూ.75 లక్షలు, 500 టన్నుల సామర్థ్యం గల గోడౌన్లకు రూ.40 లక్షలు మంజూరు చేశారు. కొన్నిచోట్ల దాతలు స్థలాలను ఉచితంగా ఇవ్వగా మరికొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. గోడౌన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోనికి తీసుకువచ్చి కూరగాయలు, ఆక్వా ఉత్పత్తులు నిల్వచేసుకోడానికి అవసరమైన కోల్డ్‌స్టోరేజ్‌లు కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. ఈ క్రమంలో జిల్లాలో కాళ్ల, కాళ్లకూరు, శృంగవృక్షం, ఉండి, కేశవరం, మత్స్యపురి, అలంపురం ప్రాంతాల్లో గోడౌన్ నిర్మాణాలు పునాది, గోడలు స్థాయికి వచ్చాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా వీటి పై దృష్టి సారించడం లేదు. అసంపూర్తి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. వీటిని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురా వాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు అక్కరకు రాని మల్టీపర్పస్ గోడౌన్లు
గత ప్రభుత్వంలో 21 మంజూరు.. 14 పూర్తి
రెండేళ్లుగా 7 గోడౌన్ల నిర్మాణాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం
ధాన్యం, ఇతర పంటలు నిల్వ చేసేందుకు రైతుల అవస్థలు
ధాన్యం ఆరబెట్టడానికి ప్లాట్‌ఫామ్స్ కరువు
జిల్లాలో 21 గోడౌన్లు మంజూరు కాగా ఇప్పటివరకు 14 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఏడు గోడౌన్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– సంకు మురళీకృష్ణ, జిల్లా సహకారశాఖాధికారి, భీమవరం


