ఆనం.. ఇదేం దారుణం! | - | Sakshi
Sakshi News home page

ఆనం.. ఇదేం దారుణం!

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

ఆనం.. ఇదేం దారుణం!

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దర్శించిన వేళ భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మంత్రి కోసం దాదాపు 40 నిమిషాల పాటు భక్తులకు స్వామి వారి దర్శనాన్ని నిలిపివేయడంతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. ఉక్కపోతను తట్టుకోలేక సహనాన్ని కోల్పోయిన పలువురు భక్తులు క్యూలైన్ల గేట్లను పీకి పడేసేందుకు యత్నించారు. ఓ బాలిక అస్వస్థతకు గురయ్యింది. ఈ క్రమంలో మంత్రి ఆనం తీరుపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి క్షేత్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు.

క్యూలైన్లలో కిక్కిరిసి..

ఉత్తర రాజగోపురం వద్ద క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు ఎండ వేడిమి, ఉక్కపోతకు గురయ్యారు. అదే సమయంలో ఓ బాలిక అస్వస్థతకు గురై కుప్పకూలింది. దీంతో ఆగ్రహానికి లోనైన పలువురు భక్తులు క్యూలైన్‌ గేట్లను పీకేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి గొడవ చేయొద్దన్న ఓ హోంగార్డుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్యూలైన్‌ షెడ్లలో కనీసం ఫ్యాన్లు లేవని, ఊపిరాడక విలవిల్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాము చచ్చిపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మంత్రి కోసం ఇంతసేపు దర్శనాన్ని నిలిపివేస్తారా.. అని నిలదీశారు. ఇదిలా ఉంటే క్యూలైన్లలో కొందరు పిల్లలను భక్తులు గేట్లు పైనుంచి బయటకు పంపారు. అవే గేట్లు మధ్య ఉన్న ఖాళీ ల్లోంచి దూరి భక్తులు బయటకు వెళ్లి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఉత్తర ద్వారం వద్ద క్యూలైన్లలో కొందరు మహిళా భక్తులు పడిగాపులు పడ్డారు.

అంతా గందరగోళం

మంత్రి, ఎమ్మెల్యే ఆలయంలోకి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు వారి వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. నాయకులతో పాటు బయట నిలిచిపోయిన వారిలో ఒకరిద్దరు దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. అయితే మారంపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ట్రస్ట్‌బోర్డు సభ్యులను లోపలికి పంపరా అంటూ నానా హడావుడి చేశాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. అయితే ట్రస్ట్‌బోర్డు సభ్యుడు యెలమాటి శ్రీనివాసరావు ఆ నాయకుడిని ఊరుకోమని బుజ్జగించారు. ఆలయంలో ఏకంగా 40 నిమిషాల పాటు మంత్రి కోసం పూజలు జరపడం వివాదాస్పదమైంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటివి చేయడం ఎంతవరకు సమంజసమనేది మంత్రి, ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాలని భక్తులు అంటున్నారు.

మంత్రి రాకతో ద్వారకాతిరుమలలో భక్తులకు ఇక్కట్లు

దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోయిన స్వామి దర్శనం

క్యూలైన్లలో ఉక్కపోతకు అవస్థలు

అస్వస్థతకు గురైన బాలిక.. గేట్లు పీకేందుకు భక్తుల యత్నం

Advertisement
 
Advertisement
Advertisement