రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు

జంగారెడ్డిగూడెం: చంద్రబాబు సర్కారు రైతులను గాలికొదిలేసిందని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్ల మెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్‌ ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, నాయకులతో జంగారెడ్డిగూడెం మండలంలో మొక్కజొన్న రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పలు హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలపాలవుతున్నారన్నారు. మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామని, అయితే చంద్రబాబు సర్కారు జేబులు నింపుకోవడానికే చూస్తోంది తప్ప రైతులను, ప్రజలకు గాలికి వదిలేసిందన్నారు. రైతులతో పాటు విద్యార్థులు, మహిళలు, పేదలు ఇలా అన్నివర్గాలు ఇ బ్బందులు పడుతున్నాయన్నారు. రైతుల కష్టాన్ని గుర్తించి వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రజలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందించాలని సునీల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

గిట్టుబాటు ధర కల్పించాలి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో ఎక్కువగా పొగాకు, మొక్కొజొన్న, ఆయిల్‌పామ్‌ వంటి పంట లు రైతులు పండిస్తున్నారని, సరైన గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో మొక్కజొన్నకు ప్రభుత్వం గిట్టుధర రూ.2,400 అందించగా.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటుచేయలేదని విమర్శించారు. దీంతో రైతులు దళారులకు మొక్కజొన్న అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది మొక్కజొన్న క్వింటాల్‌ రూ.2,200కు విక్రయిస్తే ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,800 మాత్రమే ధర వస్తోందన్నారు. వర్జీనియా పొగాకు పరిస్థితీ దారుణంగా ఉందని కిలోకు రూ.300 ధర దాటడం లేదన్నారు. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులు చేసి వర్జీనియా సాగు చేశారన్నారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శులు కుక్కల ధర్మరాజు, గురజాల పార్థసారథి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ ముప్పిడి అంజి, నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి సునీల్‌ ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement