టీడీపీలో తృప్తి చిచ్చు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో తృప్తి చిచ్చు

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

నిలిచిపోయిన తృప్తి క్యాంటీన్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర మేయర్‌కు కోపం వచ్చింది. కార్పొరేషన్‌ సొమ్ముతో ఏర్పాటుచేసిన తృప్తి క్యాంటీన్‌ ప్రారంభంలో మేయర్‌ను పట్టించుకోలేదు. ఫ్లెక్సీలో మొక్కుబడిగా చిన్నఫొటో వేశారు.. ఎమ్మెల్యేది నిలువెత్తు కటౌట్‌ వేసి కుడి, ఎడమ వైపు షాడోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. కనీసం మేయర్‌కి బొకేగాని, శాలువా కాని ఇవ్వలేదు. కారు దిగితే కనీసం పట్టించుకోకపోవడంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఆమె వేగంగా కారు ఎక్కి వెళ్లిపోవడంతో ప్రొటోకాల్‌ తెలియదా అంటూ షాడో మేయర్‌ కేకలు వేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

మేయర్‌ సీటు కోసం అంతర్యుద్ధం

రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లల్లో తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంది. మెప్మా నిధులతో డ్వాక్రా మహిళల సభ్యుల టీమ్‌తో క్యాంటీన్‌ను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా మహిళా సంఘాలకే ఇచ్చేలా కొత్త కార్యక్రమం అంటూ విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం మెప్మా డైరెక్టర్‌ ఏలూరు కమిషనర్‌కు లేఖ రాశారు. రద్దీ ప్రాంతంలో ఒక చోటు చూపించి దానిలో ఫుడ్‌ కంటైనర్‌ను ఏర్పాటుచేయాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని లేఖ సారాంశం. వెంటనే కమిషనర్‌ కృష్ణా కాల్వ గట్టుపై కొంత భూమిని చదును చేయించి మూడు రోజుల వ్యవధిలోనే ట్రక్కు, అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి హడావుడిగా దానిని డ్వాక్రా సభ్యురాలు కోనే క్రాంతి పేరుతో కేటాయించారు. శనివారం ఎమ్మెల్యే, మేయర్‌తో ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేశారు. ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. కూటమిలో మేయర్‌ సీటు కోసం అంతర యుద్ధానికి తెరలేచింది. ప్రస్తుత మేయర్‌ పదవీకాలం కొద్ది నెలల్లో ముగియడం, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ ఆధారంగా ప్రతి సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే టీమ్‌లో ఇద్దరు, ముగ్గురు ఆశావహుల పేర్లతో హడావుడి మొదలుపెట్టారు. మేయర్‌ దంపతులు మళ్లీ మూడోసారి అవకాశం కోసం టీడీపీలో లాబీయింగ్‌ మొదలుపెట్టారు. ఈ పరిణామాల క్రమంలో రెండు రోజుల నుంచి ఏలూరు టీడీపీలో పొలిటికల్‌ చర్చ కొనసాగుతోంది.

ప్రాధాన్యమివ్వకపోవడంతో మేయర్‌కు ఆగ్రహం

నిర్వాహకులపై ఎమ్మెల్యే మండిపాటు

నిలిచిపోయిన తృప్తి క్యాంటీన్‌ ప్రారంభం

అధికార పార్టీలో ఫ్లెక్సీ సాక్షిగా గ్రూపు వివాదం

మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన తృప్తి క్యాంటీన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటోతో పాటు మేయర్‌, ప్రొటోకాల్‌ పరిధిలోని వ్యక్తుల ఫొటోలు ఉండాలి. అయితే నగరపాలక సంస్థ అధికారులు మెప్మా సిబ్బంది అత్యుత్సాహంతో ఎమ్మెల్యేదే నిలువెత్తు కటౌట్‌ ఏర్పాటు చేసి కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యే వ్యవహారాలన్నీ చక్కపెట్టే కంప్యూటర్‌ ప్రసాద్‌, బెల్లంకొండ కిషోర్‌ ఫొటోలు పెద్దవిగా ఏర్పాటుచేశారు. దీంతో ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవానికి వచ్చిన మేయర్‌ ఫ్లెక్సీలు చూసి అసహనానికి గురికావడం, అలాగే నిర్వాహకులు మేయర్‌కు బొకే ఇచ్చి ఆహ్వానించకపోవడంతో అలిగి వెంటనే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి క్యాంటీన్‌ ప్రారంభించకుండా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎమ్మెల్యేల ఫోన్లకు మేయర్‌ దంపతులు స్పందించలేదని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement