అధ్వానంగా మురుగు డ్రెయిన్లు
ఉంగుటూరు: డెల్టా ప్రాంతంలోని పంట భూముల్లో మురుగునీరు పారేందుకు ప్రధానమైన డ్రెయిన్లు పూర్తిగా గుర్రపుడెక్క, తూడుతో నిండిపోయాయి. ఏటా వర్షాకాలంతో వానలు, వరదలు వచ్చినప్పుడు చేలల్లో నీరు పారక రైతులు పంట నష్టపోతున్నారు. వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు మురుగు డ్రెయిన్ల నిర్వహణ అత్యంత ముఖ్యం. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో డ్రెయిన్లు తవ్వకం, గుర్రపుడెక్క, తూడు తొలగింపు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఈ పనులను ఇప్పటివరకూ చేపట్టలేదు.
పనులపై అనుమానాలు
ఉంగుటూరు నియోజకవర్గంలో 35 వరకు మేజర్, మీడియం, మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో బొమ్మిడి నీటి సంఘం పరిధిలోని దొంతవరం డ్రెయిన్, రంగరావుకోడు, పొదకోడు వంటి మీడి యం డ్రెయిన్లు, ఉంగుటూరు నం.3 యూటీ తవ్వకాలకు రూ.40 లక్షలు మంజూరైనట్టు సమాచారం. అయితే పనులు మాత్రం చేపట్టలేదు. వేసవి పూర్తయ్యేలోపు పనులు మొదలు కావాల్సి ఉంది. చివరిలో పనులు మొదలుపెట్టి నామమాత్రంగా ముగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను పూర్తిస్థాయిలో తొలగించాల్సి ఉంది. ఉంగుటూరు మండలంలోని తోకలపల్లి మేజర్ కోడు, పందికోడు డ్రెయిన్‌తో పాటు పలు డ్రెయిన్లలో గుర్రపుడెక్క నిండి ఉంది.
డ్రెయిన్లలోని గుర్రపుడెక్క, తూడును తొలగిస్తాం. బొమ్మిడి నీటి సంఘం పరిధిలో రంగరావుకోడు, పొదకోడు, దొంతవరం డ్రెయిన్, ఉంగుటూరులో నం.3 యూటీ డ్రెయిన్ తవ్వకాలకు అనుమతులు వచ్చాయి. ఆయా పనులు చేపడతాం.
– వెంకటేశ్వరరావు, ఏఈ డ్రెయిన్స్, ఉంగుటూరు


