ఉపాధి కూలీల ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల ఆకలి కేకలు

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

కనీస సౌకర్యాలు లేవు

పనిపూటలు తగ్గాయి

దెందులూరు: ఉపాధి హామీ పథకం పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. మండుటెండలో రోజంతా కష్టపడినా సక్రమంగా వేతనాలు అందడం లేదు. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఉపాధి వేతనదారులకు రెండు కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవసాయ పనులు ముగియడంతో వేరే దారి లేక ఉపాధి పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఫిబ్రవరి వరకు వేతనాలు చెల్లించారు. మార్చి ఏప్రిల్‌ నెలలకు వేతనాలు బకాయిలు చెల్లించలేదు. అప్పుడే మే నెల రెండో వారం నడుస్తోంది.

రోజుకి లక్ష మంది పైగా హాజరు:

జిల్లాలో ఆరు లక్షల 53 వేల 949 జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఐదు లక్షల 932 జాబ్‌ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. లక్ష మంది పైగా ఉపాధి పనులకు హాజరవుతున్నారని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఉపాధి పనులకు హాజరయ్యే వారికి రోజుకి రూ.300 వరకు వేతనం లభిస్తుంది. రెండు నెలలు పూర్తయినా వేతనం అందకపోవడంతో శ్రామికుల పరిస్థితి అత్యంత దైన్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని శ్రామికులు భానుడి మంటలు తట్టుకొని ఉపాధి పనులకు వస్తున్నారు. ఉపాధి వేతనాలు నెలలు తరబడి మంజూరు చేయకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు.

రెండు నెలలుగా అందని బకాయిలు

మండుతున్న ఎండల్లో పనులు చేస్తున్న శ్రామికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. మెడికల్‌ కిట్లు, టెంట్‌, మంచినీళ్లు వంటి కనీస అవసరాలు కల్పించాలి.

– వి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి

ఆన్‌లైన్‌ విధానంతో జిల్లాలో పని పూటలు తగ్గాయి. రెండు పూటలా పని విధానం రద్దు చేయాలి. జిల్లాలో ఉపాధి శ్రామికుల పెండింగ్‌ బిల్లులు తక్షణమే చెల్లించాలి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రావాల్సిన బకాయి వేతనాలను బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి.

– మిడతా రమేష్‌, వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు, కామవరపుకోట

Advertisement
 
Advertisement
Advertisement