తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ స్కూల్ ఆయాలకు జీఓ నెంబర్ 193 మేరకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని ఈఫ్‌టీయూ నాయకులు మామిడి దాన వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయాల జనరల్ బాడీ సమావేశం శనివారం ఫాతిమా మునీషా అధ్యక్షతన ఐఎఫ్‌టీయూ యూనియన్ కార్యాలయంలో జరిగింది. వేతనాలు ఇవ్వాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. దానవర ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ ఆయాలు రోజుకు 8 నుంచి 10 గంటల వరకు పనిచేస్తున్నారని, కేవలం వీరి వేతనాలు రూ.4 వేలు అన్నారు. గత 15 సంవత్సరాలుగా స్కూల్ ఆయాలు ఫుల్ టైం చేస్తున్నప్పటికి చాలీ చాలనీ వేతనాలతో ఇల్లు గడవటమే కష్టసాధ్యంగా మారిందన్నారు. శ్రమకు తగిన విధంగా ఆదాయం రావడం లేదని వాపోయారు. కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ కల్పించాలని, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ శనివారం తెలిపారు. ఈ సంఘటన గత నెల 28న జరిగిందని, రెండు కాసుల బంగారం, అర కిలో వెండి మాయమైనట్లు బాధితుడు గోగులమూడి సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు.
భీమవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామారావు శనివారం చెప్పారు. అత్తిలి మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామానికి చెందిన పొలమరశెట్టి సాంబశివ(41) ఈ నెల 8 న తన ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై గొల్లవానితిప్ప వెళ్తుండగా పరమ్మగుడి వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో మరణిండాడని అతని సోదరుడు బాపూజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పెదపాడు: అనుమానాస్పద రీతిలో బాలుడు మృతి చెందిన సంఘటన పెదపాడు మండంలోని నాయుడుగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రమేష్ కుమార్తె నీలిమ ప్రియాంకను నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా వినోద్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి బాబు పుట్టిన తరువాత నీలిమ ప్రియాంకను అనుమానిస్తూ కాపురానికి తీసుకువెళ్లకుండా 9 ఏళ్లు కాలయాపన చేసాడు. దీంతో పుట్టింటిలోనే ఉంది. కుమారుడు రిషిబాబు(11) పెదపాడులోని శ్రీకృష్ణ గురుకులంలో చదువుకుంటున్నాడు. 2024లో పెద్దల సమక్షంలో భార్య, కుమారుడిని కాపురానికి తీసుకువెళ్లాడు. తరచూ అనుమానంతో పిల్లవాడిని నువ్వు నాకు పుట్టలేదంటూ వేధిస్తున్నట్లు నీలిమ ఐసీడీఎస్‌కి ఫిర్యాదు చేసింది. రిషిని ఓ గదిలో ఇనుపచైన్‌తో కట్టేసి కొట్టేవాడు. 9వ తేదీ ఉదయం 8.30 గంటల సమయంలో నాయుడుగూడెం ఇంటి చుట్టు పక్కల వారు రిషి తాతకు ఫోన్ చేసి మీ మనవడు చనిపోయాడని చెప్పడంతో ఇంటికి వెళ్లి చూసే సరికి బాలుడిని ఇంటిముందు మంచంపై పడుకోబెట్టారు. వీపు, చేతిపైన, కాళ్లపైన మెడపైన కమిలిన గాయాలు కనపడంతో తాత ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


