శ్రీవారి కొండపై అభివృద్ధి పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి కొండపై అభివృద్ధి పనులు ప్రారంభం

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

శ్రీవారి కొండపై అభివృద్ధి పనులు ప్రారంభం

ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై శనివారం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రూ.29 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్యూ కాంప్లెక్స్‌, అనివెట్టి మండపం, ఐదు అంతస్తుల శివాలయం రాజగోపురాలను ప్రారంభించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని, వేసవి దృష్ట్యా క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ అందించాలని ఆదేశించారు. 2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 43 ఆలయాలను రూ.54.71 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన 11 హామీలను నెరవేర్చామని మంత్రి అన్నారు. ద్వారకాతిరుమల, ఐఎస్‌ జగన్నాధపురం, పోలవరం ప్రాజెక్ట్‌ వరకు గల ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించేందుకు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్‌వీఎన్‌ఎన్‌ నివృతరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement