అయ్యా.. మా గోడు పట్టించుకోరా
సెటిల్‌మెంట్లు, కాంట్రాక్టులు, సొంత వ్యవహరాల్లో నేతలు
ప్రజాసమస్యలు, ఎన్నికల హామీలు గాలికి..
పైసావసూల్ పనులకే ప్రాధాన్యం
పథకాల కోసం వచ్చే పేదలపై చిన్నచూపు
సారు బిజీగా ఉన్నారంటూ పంపేస్తున్న సిబ్బంది
క్యాంపు కార్యాలయాలు, నియోజకవర్గాల్లో షాడోలదే పెత్తనం
షాడోలదే పెత్తనం
సాక్షి, భీమవరం: ఇసుక అమ్ముకోవచ్చు.. మట్టి అమ్ముకోవచ్చు.. రియల్ ఎస్టేట్‌లో.. బ్రాందీషాపుల్లో వాటాలు తీసుకోవచ్చు.. రిజిస్ట్రేషన్లలోనూ డ బ్బులు వసూలు చేయొచ్చు.. ‘అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంట్రాక్టర్ ఏ విధంగా డబ్బులు ఇస్తారు.. పోలీస్‌స్టేషన్ల సెటిల్‌మెంట్లలో నాయకుల కు డబ్బులు ఎలా వస్తాయో..’ ఇటీవల కూటమి ప్రజాప్రతినిధి ఒకరు చెప్పిన వీడియో వైరలైన విషయం తెలిసిందే. కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు గడిచిపోగా మూడేళ్లు మాత్రమే మిగిలింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో కొందరు నేతలు తలమునకలైనట్టు తెలుస్తోంది. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, ఆస్తి తగాదాలు, 22ఏ నిషేధిత భూవివాదాలు, కాంట్రాక్టులు, పేకాట క్లబ్బులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పోలీస్‌స్టేషన్ సెటిల్‌మెంట్లు, ఇలా ప్రతి పనికీ రేటు పెట్టి పైసావసూల్ పనులకే ప్రాధాన్యమిస్తున్నట్టు సొంత క్యాడరే గుసగుసలాడుకుంటున్నారు. ఆయా వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో తీరిక లేకుండా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు.
హామీలు గాలికి..
జిల్లాలోని పట్టణాలు, పల్లెలను డంపింగ్‌యార్డు స మస్య వేధిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేక ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. శివారు ప్రాంతాలను తాగునీరు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌ లిక వసతుల లేమి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. పేదల పక్కా ఇళ్ల నిర్మాణం పడకేసింది. ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వస్తే అవిచేస్తాం.. ఇవి చేస్తామంటూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. పింఛన్ ఇప్పిస్తాం, ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయిస్తాం. మీ బిడ్డలకు ఉద్యోగమిప్పిస్తాం, మీకు ఉపాధి కల్పిస్తాం, మీ వీధికి రోడ్డు వేయిస్తాం, డ్రెయిన్ నిర్మిస్తాం, తాగునీరు అందిస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం.. అంటూ ఇంటింటా ప్రచారంలో చెప్పుకొచ్చారు. వాటి కోసం రోజుల తరబడి సదరు నేతల క్యాంపు కార్యాలయాలకు వెళుతున్న వారికి పడిగాపులే తప్ప పనులు కావడం లేదని, గంటల తరబడి నిరీక్షించినా వారి గోడు పట్టించుకునే వారుండటం లేదంటున్నారు. వచ్చిన వారు సామాన్యులైతే సారు చాలా బిజీగా ఉన్నారు.. ఇప్పుడు కలవడం కుదరదంటూ సిబ్బంది చెప్పి పంపించేస్తున్నారు. కలిసి వెళతామంటే మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిందే. కావాల్సిన వారితో మంతనాలు పూర్తయ్యాక హడావుడిగా బయటకు వెళ్లే క్రమంలో అక్కడ వేచి ఉన్న వారికి చిన్న చిరునవ్వు విసిరి ఏమిటో చెప్పడంటూ కంగారు పెట్టడం, ఎదుటవారు చెప్పేది పూర్తిగా ఆలకించకుండానే ఇదేమిటో కాస్త చూడమంటూ కార్యాలయంలోని సిబ్బందికి పురమాయించి వెళ్లిపోవడం పలువురి నేతల కార్యాలయాల వద్ద జరుగుతున్న తంతుగా వినిపిస్తోంది.
ఏంటండి.. ఏ టోకెన్‌తో వచ్చారు.. ఆర్డినరీయా.. స్పెషలా.. వెరీవెరీ స్పెషలా..మీకు అడ్డేమిటండి. మీరు రాగానే పంపమని సార్ చెప్పారు. డైరెక్టుగా లోపలికి వెళ్లిపోండి..
– ఇది ఒక నేత కార్యాలయానికి వచ్చిన బడాబాబుతో సదరు నేత పీఏ సరదా సంభాషణ
తమ సమస్యలను పరిష్కరిస్తారన్న గంపెడాశతో సామాన్యులు గంటల కొద్ద్దీ నిరీక్షించినా నేతల దర్శన భాగ్యం దక్కదు. సెక్యూరిటీ సిబ్బంది కనీసం వారిని డోర్ వద్దకు కూడా వెళ్లనివ్వరు. వచ్చిన వారు బడా కాంట్రాక్టరో, వ్యాపారవేత్తో, సంపన్నుడో, పలుకుబడి ఉన్న వారో, సదరు నేత కుల సంఘం పెద్దో అయితే.. వెంటుండి మరీ నేరుగా నాయకుడి రూమ్‌లోకి సాగనంపుతుంటారు.
– ఇది జిల్లాలోని పలువురు నేతల క్యాంపు కార్యాలయాల వద్ద పరిస్థితి
నేతలు సొంత వ్యవహరాల్లో మునిగిపోతుండటంతో వారి తనయులు, కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులు షాడోలుగా చలామణి అవు తున్నారు. నియోజకవర్గాల్లో పెత్తనమంతా వీరి దే. బదిలీలు, నియామకాలు, పాలన వ్యవహరాలు, పేకాట క్లబ్బులు, కోడిపందేల నిర్వహణ అన్నింటిలోనూ చక్రం తిప్పుతున్నారు. అధికారులు షాడోల అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలున్నాయి. తామేమీ తక్కువ కాద న్నట్టు కొందరు అధికారిక, వ్యక్తిగత సహాయకులతో పాటు గన్‌మెన్‌లు సైతం వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వెనకేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కూటమిలోని మిగిలిన నేతలకు షాడోల వైఖరి మింగుడు పడటం లేదు. పార్టీ పిలుపు మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే షాడోలతో తమకు సరైన గుర్తింపు లేక ఉనికిని కోల్పోతున్నామని సన్నిహితుల వద్ద వీరు వాపోతున్నారు.


