ఆహ్లాదం.. గోదావరి విహారం | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం.. గోదావరి విహారం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

పాపికొండల యాత్రకు పర్యాటకుల తాకిడి

వేసవి కావడంతో అధిక సంఖ్యలో రాక

నదిపై బోటు ప్రయాణానికి ఆసక్తి

పాపికొండల విహార యాత్రకు వెళుతున్న పర్యాటక బోట్లు

బుట్టాయగూడెం: పాపికొండల మధ్య గోదావరి నదిపై లాంచీలో ప్రయాణం అద్భుతమైన అనుభూతి. వేసవిలో సైతం లాంచీలపై ప్రయాణం ఆహ్లాదా న్ని కలిగించడంతో ప్రస్తుతం పాపికొండలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సాధారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. రెండు రోజులుగా పాపికొండల యాత్రకు తాకిడి ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి పేరంటాలపల్లి వరకూ లాంచీల్లో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతున్నారు. విహార యాత్రకు విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భద్రాచలం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

సందర్శనా స్థలాలు

పాపికొండల యాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. అల్లూరి జిల్లాలోని దేవీ పట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటిష్‌ కాలపు పోలీస్‌స్టేషన్‌, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. గోదావరి తీరానికి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు కనువిందు చేస్తాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు అందాలను తిలకించవచ్చు.

గిరిజనుల ఆప్యాయత, ఆదరణ

పేరంటాలపల్లి పర్యాటకులకు గిరిజనుల ఆప్యాయత, ఆదరణ నాగరిక సమాజానికే తలమానికం. అక్కడి కొండరెడ్డి గిరిజనులు పర్యాటకులకు వెదురుతో తయారు చేసిన కళాకృతులను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యాత్రకు వెళ్లిన ప్రతిఒక్కరూ వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. గండిపోచమ్మ గుడి నుంచి ప్రశాంతమైన, సుందరమైన గోదావరి అలలపై సాగే యాత్ర సుమారు 5 గంటలకు పైగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో యాత్రికుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement