భీమవరం: సాంస్కృతిక విప్లవం పునరేకీకరణ, సాంస్కృతిక వికాసం కోసం కవులు, రచయితలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర కార్యదర్శి బీఎన్ సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరంలో అరసం 14వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. శ్రమ, స్వేదం సంపదను సృష్టిస్తున్న నాటి కాలంలో నిర్బంధ పెట్టుబడీదారి వ్యవస్థల కబంధహస్తాల నుంచి సృజనకారులు పుట్టుకొచ్చి భావప్రకటన స్వేచ్ఛకు పునాదులు వేశారన్నారు. ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం వందేళ్ల వెనక్కి వెళ్లిపోయిందని, ఫాసిస్టులు విజృంభిస్తున్న తరుణంలో అరసం ముఖ్య భూమిక పోషించాలన్నారు. అరసం అధ్యక్షుడు వేల్పుల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రచయితలు పంపన సాయిబాబా, కొత్తపల్లి త్రినాథరాజు, జవ్వాజి దాశరధి శ్రీనివాసరావు, గొన్నాబత్తల మల్లేశ్వరరావు, అల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


