గైర్హాజరే ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

గైర్హాజరే ప్రత్యేకం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

హాస్టల్‌ విద్యార్థులు

మరీ దూరం

నూరు శాతం హాజరుకు కృషి చేస్తున్నాం

భీమవరం: టెన్త్‌పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో గైర్హజారే ప్రత్యేకంగా నిలుస్తుంది. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసేవారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఒక్క పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు భోజనాలు పెట్టకపోవడంతో ప్రత్యేక తరగతలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు 22,369 మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో 19,141 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 275 ప్రభుత్వ పాఠశాలల నుంచి 12,387 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 9,567 మంది ఉత్తీర్ణత పొందారు.

269 ప్రభుత్వ హైస్కూల్స్‌లో ప్రత్యేక తరగతులు

జిల్లాలోని 275 ప్రభుత్వం హైస్కూల్క్‌కు గానూ 6 పాఠశాలలోని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా మిగిలిన 269 స్కూల్స్‌లోని 2,820 మంది ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆయా స్కూల్స్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 25 నుంచి జూన్‌ 4 వరకు నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్జెట్స్‌ వారిగా ప్రత్యేక తరగతలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సహం లేకపోగా ఫెయిల్‌ అయిన విద్యార్థులను తరగతులకు తీసుకువచ్చే బాధ్యత కూడా వారిపైనే పెట్టారు. ప్రతిరోజూ రెండు, మూడు సబ్జెక్ట్స్‌ను పూర్తిస్థాయిలో బోధించి విద్యార్థులు మొత్తం ఉత్తీర్ణత సాధించే విధంగా తీర్చిదిద్దాల్సి బాధ్యత ఉపాధ్యాయులదే. వేసవి సెలవుల్లో తప్పనిసరి పరిస్థితులో ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నా ఫెయిల్‌ అయిన విద్యార్థులు 40 శాతం కూడా హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తరగతులకు పంపించాలని కోరుతున్నా ఫలితం కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ప్రభుత్వ భోజనం, దాతల సహకారంతో స్నాక్స్‌ వంటివి ఏర్పాటు చేయడంతో పూర్తిస్థాయిలో హాజరుకాగా నేడు భోజనం లేకపోవడంతో దూరప్రాంతాల విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.

దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాస్టల్స్‌లో ఉండి పాఠశాలలో విద్యనభ్యసించగా నేడు హాస్టల్స్‌ వేసవి సెలవుల్లో మూసివేయడంతో విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అలాంటి వారు ఎక్కడి నుంచో తాను చదువుకున్న పాఠశాలకు ప్రత్యేక తరగతులకు హాజరుకావడం ఇబ్బందికరంగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగా భోజనం సదుపాయం కల్పిస్తే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

టెన్త్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యే విధంగా కృషి చేస్తున్నాం. దానికి గానూ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఫెయిల్‌ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిరోజూ ఫోన్‌ చేసి స్కూల్‌కు పంపించాలని కోరుతున్నారు.

–ఇ.నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం

పదో తరగతి ప్రత్యేక తరగతులకు స్పందన కరువు

40 శాతం హాజరు కూడా లేని వైనం

భోజనం, స్నాక్స్‌ లేక విద్యార్థుల ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement